'గాలి' గుట్టు అలీఖాన్‌కు తెలుసు

'గాలి' గుట్టు అలీఖాన్‌కు తెలుసు

 కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆయన పర్సనల్ అసిస్టెంట్(పిఏ) అలీ ఖాన్‌ను విచారిస్తే నిజాలు ఎన్నో వెలుగు చూస్తాయని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) గురువారం కోర్టులో తెలిపింది. అలీ ఖాన్ మెమోపై సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభించింది. ఓఎంసి కేసులో అలీ ఖాన్‌ను ఏడో నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఓబుళాపురం మైనింగ్ కేసులో జరిగిన అవతవకలు అన్నీ అలీ ఖాన్‌కు తెలుసునని చెప్పారు. ఈ కేసులో ఆయనను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆయనను విచారిస్తే కేసులోని సమాచారమంతా బయటకు వస్తుందని చెప్పారు. బెంగళూరు జైలులో ఉన్న ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోరింది. 

ఇందుకు అలీ ఖాన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. అలీ ఖాన్ ఎక్కడకు పారిపోలేదని చెప్పారు. సిబిఐ కార్యాలయానికి అతను పలుమార్లు వచ్చారని చెప్పారు. సిబిఐ అధికారులే ఆయనను విచారించకుండా పంపించారని తెలిపారు. కాగా ఇరువైపుల వాదనలు విన్న కోర్టు విచారణను 19వ తేదికి వాయిదా వేసింది.

కాగా ఇదే కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి సిబిఐ కోర్టులో మరోమారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అరెస్టైన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి బెయిల్ పిటిషన్ పైన గురువారం వాదనలు పూర్తయ్యాయి. తీర్పును నాంపల్లి ప్రత్యేక కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.