రాజకీయాల్లో ఉండాలనిపించట్లేదు: డిఎల్

రాజకీయాల్లో ఉండాలనిపించట్లేదు: డిఎల్

తనకు రాజకీయాలలో ఉండాలని అనిపించడం లేదని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. డిఎల్ కడప జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాలపై తన అసంతృప్తి ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెసు పార్టీతో సహా మిగిలిన అన్ని పార్టీలూ విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమవడం తనను చాలా బాధిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు రాజకీయాలలో ఉండాలని అనిపించడం లేదని నిర్వేదం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలతో చర్చించి రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నానని డిఎల్ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన పూర్తిగా అస్తవ్యస్థంగా తయారయిందన్నారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని చూసి తాను పార్టీలో ఉంటున్నానని చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం రాజకీయాల్లో ఉండాలని ఏమాత్రం అనిపించడం లేదన్నారు. కాగా మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో విభేదిస్తున్న విషయం తెలిసిందే.

మంత్రిగా ఆయన ముఖ్యమంత్రి కిరణ్ ప్రవేశ పెట్టిన ఒక్క రూపాయి కిలో బియ్యం పథకాన్ని విమర్శించారు. ఆ తర్వాత ఇరువురి మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఆయన శాఖలలో కోత పెట్టారు. దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎల్ రవీంద్రా రెడ్డి రెండుసార్లు రాజీనామా చేసేందుకు ఉపక్రమించారు. కానీ పార్టీ పెద్దలు అడ్డుపడ్డారు. తాజాగా ఆయన రాజకీయాలకే స్వస్తీ చెబుతానని చెబుతుండటం గమనార్హం.