పదవుల రక్షణకే శ్రీనివాస రెడ్డి బదిలీ

పదవుల రక్షణకే శ్రీనివాస రెడ్డి బదిలీ

 అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సిట్ చీఫ్ శ్రీనివాస రెడ్డిని బదిలీ చేయడంపై మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదవులను కాపాడుకోవడానికే శ్రీనివాస రెడ్డిని బదిలీ చేశారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. పదవులను కాపాడుకోవడానికి ఇలాంటి చర్యలకు పాల్పడడం సరి కాదని ఆయన అన్నారు. 

ఇలాంటి వ్యవహారాల వల్ల ప్రజల్లో పార్టీపై, ప్రభుత్వంపై చులకన భావం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఎసిబి అధికారులు బాగా పనిచేస్తున్నారని వారం రోజుల క్రితం చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బదిలీ చేయడం ఏ మేరకు సమంజసమని ఆయన అడిగారు. శుక్రవారం జరిగిన తెలంగాణ కాంగ్రెసు నాయుకల సమావేశానికి తనకు ఆహ్వానం లేదని ఆయన చెప్పారు. 

మద్యం సిండికేట్లపై విచారణకు ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు నేతృత్వం వహిస్తున్న శ్రీనివాస రెడ్డిని ప్రభుత్వం రాత్రికి రాత్రే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లాకు చెందిన ఎసిబి సిఐ గణేష్ శ్రీనివాస రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పేరును, ఆయన కుటుంబ సభ్యుల పేర్లను నివేదికలో చేర్చలేదని శ్రీనివాస రెడ్డి తనను దుర్భాషలాడినట్లు ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో వివాదం రచ్చకెక్కింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస రెడ్డి బదిలీ జరిగింది.

శ్రీనివాస రెడ్డిని రిలీవ్ చేయడానకి ఎసిబి డైరెక్టర్ జనరల్ భూపతి రాజు నిరాకరించడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ జోక్యం చేసుకున్నారు. నిబంధనలను పాటించాలని ఆయన భూపతిరాజుకు క్లాస్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ స్థితిలో శ్రీనివాస రెడ్డి ఎసిబి నుంచి రిలీవ్ అయ్యారు. దీనిపై ప్రతిపక్షాలతో పాటు అధికార కాంగ్రెసు పక్షంలోని కొంత మంది ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు.