కేసిఆర్ తో జగన్ కుమ్మక్కు

కేసిఆర్ తో జగన్ కుమ్మక్కు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని మంత్రి శైలజానాథ్ ఆదివారం విమర్శించారు. వారిద్దరి మధ్య రహస్య ఒప్పందం కుదిరిందన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసుతో టిఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న సందర్భాలు వేరు అని ఆయన అన్నారు.

ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలలో జగన్ పార్టీకి ఓటు వేయడంపై సమైక్యవాదులు ఆలోచించాలని సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెసు, టిడిపిల్లో విభజన, సమైక్యవాదం వినిపిస్తోందన్నారు. కాంగ్రెసు ఎన్నికల కోసం పుట్టిన పార్టీ కాదని దేశం కోసం పుట్టిన పార్టీ అన్నారు. లోపాయికారి ఒప్పందాలతో ఉప ఎన్నికలు తీసుకు వస్తున్న జగన్ పార్టీని కనిపెట్టాలన్నారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు దళితులు ఇప్పటికైనా గుర్తుకు రావడం మంచి విషయమన్నారు. అసెంబ్లీలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇది వరకే చెప్పారన్నారు. ఉప ఎన్నికలలో అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ ప్రచార అస్త్రాలు అని ఆయన చెప్పారు. రాష్ట్రం ఎప్పటికై ఐక్యంగానే ఉంటుందని చెప్పారు.