హనుమాన్ జయంతికి విస్తృత ఏర్పాట్లు

హనుమాన్ జయంతికి విస్తృత ఏర్పాట్లు

హనుమజ్జయంతి సందర్భంగా రాజధాని కాషాయ వర్ణం సంతరించుకుంది. లక్షలాది మంది విహెచ్‌పి కార్యకర్తలు పండుగను వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో వీహెచ్పీ నేత ప్రవీణ్ తొగాడియా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. హనుమాన్ జయంతి వచ్చిందంటే హైద్రాబాద్లో కాషాయాల సందడి అంతా ఇంతా కాదు. ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించినట్లుగానే ఈ సారి కూడా భారీ ర్యాలీకి విహెచ్‌పి ప్లాన్ చేసింది. లక్షలాదిమందిని ఇందులో భాగం చేయాలని విహెచ్‌పి ఇప్పటికే గ్రౌండ్ లెవల్లో కార్యకర్తలను, హిందుత్వవాదులను ఉత్తేజం చేసింది. శుక్రవారం ఉదయం గౌలీగూడ రామ మందిరం నుంచి పెద్దఎత్తున శోభాయాత్ర నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియాతో పాటు అంతర్జాతీయ అధ్యక్షులు రాఘవరెడ్డి హాజరవనున్నారు. ఈ ర్యాలీ గౌలీగూడ నుంచి తాడ్‌బంద్ హనుమాన్ మందిరం వరకు నిర్వహిస్తారు. హైద్రాబాద్-సికింద్రాబాద్‌ను కలుపుతూ సాగే ర్యాలీకి విహెచ్‌పి ఇప్పటికే అనుమతులు తీసుకుంది. తొగాడియా ప్రారంభోపన్యాసం తర్వాత ఉదయం 10గంటలకు ర్యాలీ మొదలవుతుంది. 6 గంటల పాటు సాగి.. సాయంత్రం 4 గంటలకు తాడ్‌బంద్ చేరుతుంది. అక్కడ జరిగే ముగింపోన్యాసంతో ర్యాలీ ముగుస్తుందని విహెచ్‌పి ప్రతినిధులు తెలిపారు. మరోవైపు.. ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉన్న పాతనగరంలో ఈ ర్యాలీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.