చిరంజీవి సొంతూరులో జగన్‌ పర్యటన

చిరంజీవి సొంతూరులో జగన్‌ పర్యటన

గుంటూరు జిల్లాలో ఓదార్పు ముగియడంతో.. చిరంజీవి ఇలాకాలో జగన్‌ టూరేస్తున్నారు. రాబోయే ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మొగల్తూరులో బహిరంగ సభ ఏర్పాటుచేశారు. నర్సాపురం చేరుకున్న యువనేతకు ఘన స్వాగతం పలికిన వైఎస్సార్‌ సీపీ అభిమానులు... చేతనైతే రెండు స్థానాల్లో గెలవండి చూద్దామంటూ కాంగ్రెస్‌ నాయకులకు సవాల్‌ విసురుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ జిల్లాలో నర్సాపురం, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు రానున్న రోజుల్లో ఉప ఎన్నికలు జరగనుండగా.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి నర్సాపురం సెగ్మెంట్‌ పరిధిలో విస్తృతంగా పర్యటించనున్నారు. 

గుంటూరు జిల్లాలో ఓదార్పుయాత్ర ముగించుకుని రోడ్ మార్గంలో బయల్దేరిన జగన్‌కు హనుమాన్‌ జంక్షన్ దగ్గర నాయకులు రిసీవ్‌ చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోకి స్వాగతం పలికారు. కాబోయే సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. 

ఏలూరు మీదుగా నర్సాపురం చేరుకున్న జగన్‌.. స్థానిక లూథరన్ చర్చిలో ప్రార్థనలతో టూర్‌ను మొదలుపెడతారు. మొగల్తూరు మండలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ముత్యాలపల్లిలో అమ్మవారిని దర్శించుకుంటారు. రాత్రికి మొగల్తూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగింస్తారు.

జగన్‌ రాకతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. ఉప ఎన్నికల్లో నర్సాపురం, పోలవరం నియోజకవర్గాల్లో గెలిచే సత్తా ఇతర పార్టీలకు లేదని విమర్శనాస్త్రాలు సంధించారు. మంత్రి వట్టి వసంత్‌ కుమార్‌ తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఘాటుగా బదులిచ్చారు. పనిలోపనిగా మంత్రికి సవాల్‌ విసిరారు.

సొంతూరు అభివృద్ధికి చిరంజీవి ఇసుమంతైనా సాయం చేయలేదని గత ఎన్నికల సమయంలో వైఎస్సార్‌ ఇక్కడినుంచే తీవ్రంగా ఎండగట్టారు. ఇప్పుడు జగన్‌ మొగల్తూరు వస్తుండడంతో.. ఎలాంటి వ్యూహం అమలు చేస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.