మయన్మార్‌లో ఆంగ్‌సాన్‌ సూకీ ఘనవిజయం

మయన్మార్‌లో ఆంగ్‌సాన్‌ సూకీ ఘనవిజయం

మయన్మార్ చరిత్ర మారనుందా..? ఆంగ్ సాన్ సూకీ కష్టాలు తీరనున్నాయా..? జుంటా సర్కారుకు చావుదెబ్బ తప్పదా..? అవుననే సమాధానం వస్తోంది. తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో సూకీ పార్టీ విజయబావుటా ఎగరేయడంతో ఆ పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్య వాదులు పండగ చేసుకుంటున్నారు.

మయన్మార్‌ పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజాస్వామిక ఉద్యమ నేత ఆంగ్‌సాన్‌ సూకీ ఘన విజయం సాధించారు. సూకీ తాను పోటీ చేసిన కౌమూ స్థానంలో 82 శాతం ఓట్లతో ప్రత్యర్థులపై ఆధిపత్యం సాధించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఫలితాలను ఎన్నికల కమిషన్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఒక వారంలో ఇవి వచ్చే అవకాశముంది. మొత్తం 45 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో దాదాపు 64 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు. ఎన్నికల బరిలో ఏడుగురు స్వతంత్ర అభ్యర్ధులతో పాటు 17 రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం 157 మంది పోటీ చేశారు.

దీర్ఘకాలిక విరామం అనంతరం పార్ల మెంట్‌కు జరిగిన ఈ ఉప ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బర్మా ఓటర్లు బారులు తీరారు. 1990 తరువాత తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ సారథి, నోబుల్‌ పురస్కార గ్రహీత ఆంగ్‌సాన్‌ సూకీ తన తొలి ఓటును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో సూకీకి చెందిన NLD మొత్తం 45 స్థానాలలో పోటీపడుతోంది. అటు.. 
ఈ ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు విదేశీ మీడియాతో పాటు అంతర్జాతీయ పరిశీలకులకు కూడా అక్కడి ప్రభుత్వం అనుమతించింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగితే సూకీపై ఆంక్షలను సడలిస్తామని ఐరోపా యూనియన్‌ మయన్మార్‌కు హామీ ఇచ్చింది. అయితే సూకీ మాత్రం జుంటా ప్రభుత్వాన్ని అంత తేలిగ్గా నమ్మలేమని హెచ్చరించారు. 

మరోవైపు సూకీ ఘనవిజయం ఖాయమని వార్తలు రావడంతో ఆమె అబిమానులు, పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం ఉరకలు వేసింది, వీధులలోకి వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. సూకీ విజయంతో ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేదీ ప్రభుత్వానికి లేకపోయినా 2015లో జరిగే సాధారణ ఎన్నికలకు దిక్సూచిగా ఇవి పనిచేస్తాయని కేడర్ అంటోంది.