దర్శకుడు ట్విస్ట్ కి సమంత షాక్

దర్శకుడు ట్విస్ట్ కి సమంత షాక్

ఏ మాయ చేసావే చిత్రంతో సమంతకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్. ఆ ఒక్క చిత్రంతో ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో ఆమె వరసగా పెద్ద హీరోల చిత్రాలలో బుక్ అయిపోతూ కుర్రాళ్ల గుండెల్లో నివాసమేర్పరుచుకుంది. దాంతో తమిళంలో తన కెరీర్ ఆరంభించి అక్కడ నిలదొక్కుకోలేకపోయిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ గౌతమ్ మీనన్ అండతోటే అక్కడ కూడా మకాం వేయాలని ప్రయత్నించింది. దానికి తోడు గౌతమ్ మీనన్ కూడా ఆమెను తన సినిమాల్లో బుక్ చేస్తూ వస్తున్న్నారు. త్వరలో వీరి కాంబినేషన్ లో ఎటో వెళ్లి పోయింది మనస్సు అనే చిత్రం కూడా వస్తోంది. అందులో తెలుగు,తమిళ,హిందీ వెర్షన్ లకు హీరోలు మారినా హీరోయిన్ మాత్రం సమంతానే కావటం విశేషం.

ఇలా ఇంతలా సమంత తన డార్లింగ్ అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ వస్తున్న గౌతమ్ మీనన్ హఠాత్తుగా ఆమెకు షాక్ ఇచ్చాడు. తమిళ స్టార్ హీరో విజయ్‌తో తెరకెక్కించనున్న మోహన అధ్యాయం ఒండ్రు చిత్రంలోను సమంతనే హీరోయిన్ అని ఆమెకు మొదట మాట ఇచ్చారు. అయితే మీడియాలో వీరిద్దరి మధ్య దర్శకుడు,హీరోయిన్ సంభందం కాకుండా వేరే ఏదో ఉందనే టాక్ మొదలైంది. దాంతో ఈ పరిస్థితుల్లో మోహన అధ్యాయం ఒండ్రు చిత్రంలో హీరోయిన్ సమంత కాదంటూ ఆమెకు ట్విస్ట్ ఇచ్చారు గౌతమ్ మీనన్. తన చిత్రాల్లో వరుసగా ఒకే హీరోయిన్ నటించడం ఇష్టం లేదని, అందుకే విజయ్ చిత్రం నుంచి సమంతను తొలగించినట్లు చెప్తున్నారు. ఇది మాత్రం సమంతకు ఊహించని షాక్. ఆమె తమిళంలో కాస్త పెద్ద హీరో ప్రక్కన బుక్కవగానే ఇలా ట్విస్ట్ పడటం జీర్ణించుకోలేకపోతోంది.

అయితే సమంత మాత్రం తెలివిగా ఈ విషయంపై స్పందిస్తోంది. గౌతమ్ మీనన్ ..కాక కాక (తెలుగు ఘర్షణ)చూసే నేను ఆయనకు ఫ్యాన్ ని అయ్యాను. నా అదృష్టం కొద్దీ ఆయన సినిమాల్లో నటించే ఛాన్స్ నాకు వచ్చింది. నాకు ఆయన లైఫ్ ఇచ్చారు. ఇక ఆయన నన్ను తన తదుపరి సినిమాకు తీసుకుంటారా లేదా అన్నది ఆయన ఛాయిస్. నేను ఆయనిని ఎప్పుడు ఎవాయిడ్ చేయను. ఇక విజయ్ చిత్రం గురించి నాకు తెలియదు. ప్రస్తుతం ఆయన డైరక్ట్ చేస్తున్న ఎటో వెళ్లిపోయింది మనస్సు చిత్రంలో నిత్యా అనే పాత్రను చేస్తున్నాను. మూడు భాషల్లో ఆ చిత్రం రిలీజవుతోంది. మూడింటిలోనూ నేనే హీరోయిన్ ని కావటం నా అదృష్టం అంది.

అలాగే తాను తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. వచ్చే సంవత్సరం అంతా కూడా తన డేట్స్ ఫిల్ అయిపోయాయని చెప్పుకొచ్చింది. తను ఇప్పుడు కొత్త సినిమాల్లో డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని ఇవ్వాలంటే చాలా కష్టం అంది. ప్రస్తుతం సమంత నటించిన ఈగ విడుదలకు సిద్దంగా ఉంది. రాజమౌళి డైరక్ట్ చేసిన ఆ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. సమంత సైతం ఆ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంది. అలాగే నానితో చేసిన మరో సినిమా ఎటో వెళ్లిపోయింది మనస్సు ప్రోమో లు కూడూ మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. వీటితో పాటు ఆమె మహేష్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కూడా చేస్తోందన్న విషయం తెలిసిందే.