కరెంట్ షాక్ ఇచ్చి భార్య దారుణ హత్య

కరెంట్ షాక్ ఇచ్చి భార్య దారుణ హత్య

గడ్డపారతో భార్యను చంపేందుకు ప్రయత్నించి అది విఫలమవడంతో ఆ తర్వాత కరెంట్ షాక్‌తో ఓ భర్త హత్య చేసిన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. అస్మిన్ బేగం అనే యువతిని హైదరాబాదులో ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వారి పెళ్లి అయి కేవలం ఐదు నెలలే. కాళ్ల పారాణి ఆరకముందే కట్టుకున్న భర్తే ఆమెను దారుణంగా ఆదివారం రాత్రి హత్య చేశాడు.

ఈ దంపతులు రాజేంద్ర నగర్‌లోని కిషన్‌బాగ్‌లో ఉంటున్నారు. భర్త ఆటో డ్రైవర్. మృతి చెందిన ఆస్మిన్ బేగం ఇంట్లోనే ఉంటుంది. అయితే ఆదివారం రాత్రి ఆమె తలపై గడ్డపారతో మోది చంపేందుకు ప్రయత్నించాడు. ఆమె తలపై తీవ్ర గాయమైంది. భార్య చనిపోలేదని తెలుసుకున్న ఆ క్రూర భర్త ఆ తర్వాత ఆమెను ఇనుప మంచంపై పడుకోబెట్టి దానికి కరెంట్ షాక్ ఇచ్చాడు. ఆమె చనిపోయిందని తెలుసుకున్న తర్వాత భర్త పరారయ్యాడు.

ఆస్మిన్ బేగం మృతి తెలిసి బంధువులు వచ్చారు. ఐదు నెలల క్రితమే పెళ్లి అయిందని, అతను ఎందుకు చంపాడో తమకు తెలియదని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

కోస్గి మండలంలోని గనుమాల్ దగ్గర సోమవారం ఉదయం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీంతో బాలుడి మణికట్టు తెగి తీవ్ర రక్తస్రావం అయింది. బాధిత బాలుడు వీరారం గ్రామానికి చెందిన వాడిగా తెలుస్తోంది. బాలుడిపై దాడి చేసి ఓ బైకుపై వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే బాలుడి తండ్రి గ్రామానికి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లపై అనుమానం వ్యక్తం చేశారు