బొత్స దెబ్బకు ఏసిబి చీఫ్ ఔట్

బొత్స దెబ్బకు ఏసిబి చీఫ్ ఔట్

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దెబ్బ మద్యం సిండికేట్లపై దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ శ్రీనివాస రెడ్డిపై పడింది. మద్యం సిండికేట్లపై దర్యాప్చు చేయడానికి ఏర్పాటు చేసిన సిట్‌కు ఇప్పటి వరకు శ్రీనివాస రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఆ స్థానం నుంచి శ్రీనివాస రెడ్డిని మార్చేసి మరో అధికారిని నియమించారు. బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని విజయనగరం ఎసిబి సిఐ గణేష్‌పై శ్రీనివాస రెడ్డి తీవ్రమైన ఒత్తిడి తేవడమే కాకుండా, ఆయనను దుర్భాషలాడినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. శ్రీనివాస రెడ్డికి గణేష్ లీగల్ నోటీసు ఇప్పించారు. 

ఎసిబి విజయనగరం సిఐ గణేష్ విజయనగరం జిల్లా మద్యం సిండికేట్లపై రహస్యంగా దర్యాప్తు చేసి సిట్ చీఫ్ శ్రీనివాస రెడ్డికి పంపించారు. అయితే, దాంతో సంతృప్తి చెందకుండా శ్రీనివాస రెడ్డి తనను పిలిపించి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు నివేదికలో లేవని తప్పు పట్టడమే కాకుండా తనను దూషించారని గణేష్ లీగల్ నోటీసు ఇచ్చారు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బొత్స సత్యనారాయణను దెబ్బ తీయడానికి శ్రీనివాస రెడ్డి ద్వారా ప్రయత్నించారని ప్రచారం జరిగింది. ఈ దుమారం చెలరేగుతున్న సమయంలోనే బొత్స సత్యనారాయణ ఢిల్లీ వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి తనను మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఇరికించాలని చూస్తున్నారని ఆయన అధిష్టానానికి చెప్పారు. దీంతో అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. 

కిరణ్ కుమార్ రెడ్డిని, బొత్స సత్యనారాయణను, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ఢిల్లీకి పిలిచింది. కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లడానికి ముందు రాత్రికి రాత్రి శ్రీనివాస రెడ్డిని సిట్ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించారు. బుధవారం రాత్రి శ్రీనివాస రెడ్డి బదిలీ కాగా, కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బొత్స ఒత్తిడి కారణంగానే శ్రీనివాస రెడ్డిని సిట్ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించారు.