ఐదేళ్ల చిన్నారి దారుణహత్య

ఐదేళ్ల చిన్నారి దారుణహత్య

డబ్బుల కోసం ఐదేళ్ల చిన్నారిని హతమార్చిన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. ఈ ఘటన దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన రమేష్, అనిత దంపతులు పదహారేళ్ల క్రితం నగరానికి వచ్చారు. రమేష్ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆయన కుమారుడు వెంకటేష్ ఎల్‌కెజి చదువుతున్నాడు. గత నెల పదిహేడవ తారీఖున మధ్యాహ్నం ఆడుకోవడానికి వెళ్లి కిడ్నాప్‌కు గురయ్యాడు.

బాలుడు కనిపించక పోవడంతో మొదట అంతా వెతికిన తల్లిదండ్రులు, బంధువులు 18 ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేశారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన కాసేపటికి బాలుడి తండ్రి రమేష్‌కు అగంతకుల నుండి ఫోన్ వచ్చింది. తమకు రూ.2 లక్షలు ఇవ్వాలని అలా అయితే వెంకటేష్‌ను తిరిగి పంపిస్తామని చెప్పారు. ఫోన్ వివరాలను అతను పోలీసులకు తెలిపారు.

దీనిని గోప్యంగా ఉంచిన పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. కిడ్నాప్ చేసినప్పటి నుండి దుండగులు ఐదారుసార్లు ఫోన్ చేశారు. వారు ఎవరికీ అనుమానం రాకుండా వేరు వేరు ప్రదేశాలలో పబ్లిక్ ఫోన్ బూతుల నుండి ఫోన్లు చేసినట్లుగా తెలుస్తోంది. బాగా తెలిసిన వారే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో దర్యాఫ్తు చేశారు.

ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడు రాజును గుర్తించి మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం సూరారం కాలనీకి ఆనుకొని ఉన్న నిర్జన ప్రదేశంలో బాలుడిని హత్య చేసి పడేసినట్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. పోలీసులు బాలుడి శవాన్ని గుర్తించారని సమాచారం.