ఢిల్లీ వైపు సైన్యం కదలిక అబద్ధం

ఢిల్లీ వైపు సైన్యం కదలిక అబద్ధం

ప్రభుత్వానికి, రక్షణ మంత్రిత్వ శాఖకు తెలియజేయకుండా సైన్యానికి చెందిన రెండు కీలక యూనిట్లు దేశరాజధాని ఢిల్లీ వైపు కదలినట్లు వచ్చిన వార్తలను ఆర్మీ చీఫ్ వికె సింగ్ కొట్టిపారేశారు. సైన్యం తిరుగుబాటు చేస్తుందా అనే అనుమానం కలిగించేలా ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తాకథనాన్ని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఇప్పటికే ఖండించారు. జనవరిలో సైన్యం కదలికలతో గంటల తరబడి భారత ప్రభుత్వం ఆందోళనకు గురైందని ఆ పత్రిక రాసింది. ఆ వార్తాకథనంపై వికె సింగ్ గురువారం ప్రతిస్పందించారు. 

సైన్యం కుట్రకు సంబంధించి ఓ ప్రముఖ ఆంగ్లదినపత్రికలో వార్తాకథనం ప్రచురితం కావడం వెనక యుపిఎ ప్రభుత్వంలోని ఓ సీనియర్ మంత్రి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వికె సింగ్‌కు, రక్షణ మంత్రి ఆంటోనీకి మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో తీవ్ర సంచలనం సృష్టించి పరిస్థితి మరింత విషమించాలనే ఉద్దేశంతో ఆ మంత్రి ఈ పనికి ఒడిగట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రధానితో పాటు రక్షణ మంత్రి ఆ వార్తను ఖండించడంతో మంత్రి నిరాశకు గురైనట్లు చెబుతున్నారు. 

వార్తాకథనం వెనక ఉన్న మంత్రి బంధువు ఒకరు ఆర్మీ డీల్ వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తోంది. విదేశాల పర్యటనలో అతను ఆయుధ వ్యాపారులను, వారి లాబీయిస్టులను కలుస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వార్తాకథనం వచ్చింది. 

సైన్యం కదలికలకు సంబంధించిన వార్తాకథనంపై ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం ప్రతిస్పందిస్తూ - ఇవి భయాందోళనలు కలిగించే వార్తలని, ఇటువంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. సైన్యాధ్యక్షుడికి, ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతోందనే వాదనను మన్మోహన్ సింగ్ కొట్టిపారేశారు. దాని గురించి సైన్యం ఇది వరకే వివరణ ఇచ్చిందని, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వార్తాకథనం ఆధారరహితమని రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ అన్నారు. సైనిక బలగాల దేశభక్తిపై తమకు నమ్మకం ఉందని, భారత ప్రజాస్వామ్యాన్ని పలుచన చేసే పని వారు ఏదీ చేయరని ఆయన అన్నారు.