భాను ఎలా ఖర్చు చేశాడు?

భాను ఎలా ఖర్చు చేశాడు?

)రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూరి హత్య కేసులో ప్రధాన ముద్దాయి భాను కేవలం నాలుగు లక్షల రూపాయలతో గడచిన 14 మాసాలుగా దేశమంతా తిరిగాడా. ఎవరి కంట పడకుండా జాగ్రత్తలు తీసుకున్న భాను పలు సందర్భాలలో హోటళ్ళలో బస చేశాడు. అయినా స్వల్పమొత్తం ఖర్చయిందంటే నమ్మశక్యమనిపించడం లేదు. పరిమితంగా డబ్బులు ఖర్చు చేసినప్పటికీ ఎవరి కంటా కనపడకుండా ఉండేందుకు భాను జాగ్రత్తలు ఎలా తీసుకున్నడన్న విషయంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. భాను చెప్పిన పలు అంశాలపై సీఐడీతో పాటు పలువురి మనసులను తొలుస్తున్న ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. భానును సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఆయన వద్ద రివాల్వర్‌తో పాటు నాలుగు డెబిట్‌ కార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డెబిట్‌ కార్డులను భాను అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఎక్కడా వినియోగించలేదని తెలుసుకున్న సీఐడీ పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.

భానును కొద్ది రోజుల క్రితమే సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని పలు అంశాలపై విచారణ జరిపారు. అయితే ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ భాను తన వద్ద ఉన్న డెబిట్‌ కార్డులను వినియోగించకుండా ఎందుకు వదిలేశారన్న అంశంపై తేల్చలేకపోయారు. భాను వద్ద నాలుగు కార్డులున్నాయని, ఇందులో ఒక కార్డు బెంగళూరులో జారీ అయినట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు. సూరి హత్యానంతరం అజ్ఞాతంలోకి వెళ్ళిన భాను పోలీసులకు ఏ మాత్రం క్లూ దొరకకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలను తీసుకున్నాడు. ఘటన జరిగిన వెంటనే తప్పించుకునేందుకు పకడ్బంధీ ఏర్పాట్లు చేసుకున్న భాను ఆ తర్వాత తనకు పరిచయం ఉన్న వారితో కానీ, కుటుంబసభ్యులతో కానీ, మిత్రులు, శ్రేయోభిలాషులు, చివరకు తన సహాయం కోసం వచ్చిన పలువురితో ఏ మాత్రం సంప్రదింపులు జరపలేదు. పోలీసులు తన కోసం వేటాడుతున్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న భాను తరచూ తన మకాంలను మార్చాడు. ఇంత చేసినా ఆయన చేసిన ఖర్చు కేవలం రూ. 4 లక్షలే అని పోలీసులు అంటున్నారు. భాను వద్ద డెబిట్‌ కార్డులున్నప్పటికీ వాటిని ఎక్కడా వినియోగించలేదని, కార్డుల వినియోగంపై పోలీసులు నిఘా పెట్టి ఉంటారన్న ఉద్దేశ్యంతోనే భాను వీటిని వాడకుండా పక్కకు పెట్టి ఉంటాడని పోలీసులు అంటున్నారు. అయితే కార్డులను వాడాలన్న ఉద్దేశ్యం నిజంగా భానుకు లేకపోతే వాటిని కాల్చి వేయడం కానీ, ముక్కలుగా చేసి ఎక్కడో పడవేయడం కానీ ఎందుకు చేయలేదన్న ప్రశ్నలకు సీఐడీ పోలీసుల నుంచి స్పందన రావడం లేదు. స్వాధీనం చేసుకున్న నాలుగు కార్డులు భానువేనా లేక ఇతరులవా అన్న విషయంపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

ఇదిలా ఉండగా, జహీరాబాద్‌ సమీపంలోని ఒక దాబాలో తన మిత్రుడి కోసం వేచి ఉన్న భానును విశ్వసనీయ సమాచారంతో అరెస్టు చేశామని చెబుతున్న సీఐడీ పోలీసులు పంచుల కోసం ఎదురు చూసి చివరకు స్థానిక పోలీసుల సహాయంతో పట్టణంలో నుంచి ఇద్దరు పంచులను ఎందుకు పిలిపించాల్సి వచ్చిందన్నది కూడా అర్థం కావడం లేదు. పోలీసులు చెబుతున్నట్లుగా భాను మద్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో నెలకు అద్దె రూ. 3 వేలు చెల్లిస్తూ నివసిస్తూ తన కుటుంబసభ్యుల వివరాలను రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌ ద్వారా తెలుసుకుంటున్నాడు.

ఇంటర్నెట్‌ ద్వారా సమాచారాన్ని తెలుసుకునే భాను తనకు కావాల్సిన డబ్బులను ఆన్‌లైన్‌ ద్వారా బదలాయింపు కోసం ఎందుకు ప్రయత్నించడం లేదన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. భాను విచారణ సందర్భంగా తెలిపిన పలు అంశాలపై సీఐడీ పోలీసులకు సవాలక్ష అనుమానాలు వస్తున్నాయి. వీటన్నింటినీ నివృత్తి చేసుకునేందుకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. భానుకు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయని, ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలేవీ చెప్పలేదన్న విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. రాష్ట్రం బైట ఉన్నప్పటికీ భాను ఇక్కడ ఉన్న పలువురు ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్నాడని, భాను అరెస్టుకు ముందు ఒక నేత లొంగుబాటుకు మద్యవర్తిత్వం జరిపినట్లు తెలుస్తోంది. భాను పెదవి విప్పితే పలువురు ప్రముఖుల బండారం బయట పడుతుందని, అందుకే భాను అరెస్టు విషయాన్ని సీఐడీ పోలీసులు చివరి వరకు అత్యంత రహస్యంగా ఉంచారని కూడా అంటున్నారు.