నేనంటే ప్రతిపక్షాలకు హడల్ : యడ్యూరప్ప

నేనంటే ప్రతిపక్షాలకు హడల్ : యడ్యూరప్ప

 తానంటే ఇప్పటికీ ప్రతిపక్ష నాయకులకు హడల్ అంటూ తిరిగి అధికారంలోకి వచ్చి తమ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తారేమోనన్న భయం ప్రతిపక్షాలను పట్టి పీడిస్తోందని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పేర్కొన్నారు. తుమరూరులోని సిద్దగంగ మఠంలో డాక్టర్ శివకుమార స్వామిజీ 105వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అందచేసి ఆశీర్వాదం అందుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను అధికారం కోసం ప్రాకులాడలేదని ఎటువంటి పోరాటం చేయలేదని తానేమీ చేసినా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే పోరాటాలు నిర్వహించానని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు అనవసరంగా తనకు వ్యతిరేకంగా కుతంత్రాలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు నిర్వహించే సభలు, సమావేశాలలో యడ్యూరప్పను విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్లు తెలిపారు. తిరిగి యడ్యూరప్ప అధికారంలోకి వస్తే తమకు పుట్టగతులు ఉండవని వారి భయమన్నారు. అందువల్లనే తనపై లేనిపోని ఆరోపణలు సృష్టిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నట్లు చెప్పారు. యడ్యూరప్ప తిరిగి అధికారం చేపడితే కర్ణాటకను నెంబర్‌గా అభివృద్ధి పరుస్తారేమోనని రాష్ట్ర ప్రజల ఆర్థిక  స్థితిగతులను మెరుగు చేస్తారేమోనన్న భయంతో ప్రతిపక్షాలు తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. అధికారం కోల్పోయిన 7 నెలల్లో తనకు ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులన్న నిజం తెలిసిందన్నారు. తాను ఆరోపణలనుంచి విముక్తిడినైన తర్వాత సిద్దగంగమఠానికి వచ్చి స్వామిజీ ఆశార్వాదాలు అందుకున్న అనంతరం తనకు మరింత బలం వచ్చిందన్నారు. స్వామిజీ మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రజల సేవకు పునరంకితమవుతున్నట్లు తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న అవధిలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రానికి సేవ చేశానన్న తృప్తి తనకుందన్నారు.