నో టెన్షన్,చిరునవ్వుతో భాను

నో టెన్షన్,చిరునవ్వుతో భాను

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కిన భాను కిరణ్ శనివారం మీడియా ముందు ప్రవేశ పెట్టినప్పుడు ఆయన చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. పోలీసుల చేతికి చిక్కినప్పటికీ ఆ టెన్షన్ భానులో ఏమాత్రం కనిపించలేదు. విలేకరుల సమావేశంలో సిఐడి అడిషనల్ డిజి ఎస్వీ రమణ మూర్తి మాట్లాడుతుండగా భాను అనేకసార్లు నవ్వుతూ కనిపించాడు సూరి కుటుంబం నుండి మీకు ఏమైనా ముప్పు ఉందని భావిస్తున్నారని అని విలేకరులు ప్రశ్నించినా ఆయన నోరు విప్పకుండా నవ్వేసి ఊరుకున్నాడు

టిషర్టు ధరించి ఉన్న భాను మొహంలో ఎలాంటి ఆందోళన కానీ, ఏ అలసట కానీ కనిపించలేదు. విలేకరుల సమావేశం సమయంలో భాను చేతులు రెండింటిని వెనక్కు కట్టేసి నిలబెట్టారు. కాగా భాను కిరణ్‌ను కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆయనకు నాలుగో తేది వరకు రిమాండ్ విధించింది.

చెర్లపల్లి జైలులోని మానస బ్యారెక్‌లో భాను కిరణ్‌ను పోలీసులు ఉంచారు. ఉదయం ఆరు గంటలకు తోటి ఖైదీలతో పాటు కిచిడీ తిన్నాడు. పోలీసులను అడిగి కొన్ని పత్రికలను తెప్పించుకొని చదివాడు. మరోవైపు భాను కిరణ్ సూరిని హత్య చేసిన అనంతరం సెల్ ఫోన్ కు దూరంగా ఉండిపోయాడు. సెల్ ఫోన్ వాడితో దొరికిపోవచ్చునని భావించిన భాను హత్య చేసిన కొద్ది సేపటికే ఫోన్ పారేశాడు.

అప్పటి నుండి గత ఫిబ్రవరి వరకు సెల్ ఫోన్ ఉపయోగించలేదు. తన కుటుంబ సభ్యులతో కేవలం పబ్లిక్ ఫోన్ బూత్‌ల నుండే మాట్లాడేవాడు. సియోనిలో రూ.3వేలు లంచం ఇచ్చి రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర ధృవపత్రాలు తీసుకున్నాడు. ఫిబ్రవరిలో ఓ సిమ్ కార్డు సంపాదించాడు. ఇది మధ్యప్రదేశ్ కు చెందినది కావడంతో పోలీసులు గుర్తించలేక పోయారు.

ఆ సిమ్ కార్డుతోనే అప్పుడప్పుడు తన కుటుంబ సభ్యులతో మాట్లాడేవాడు. తండ్రి చిన్నప్పుడు మృతి చెందడంతో తన తల్లి, ఇతర కుటుంబ సభ్యుల పట్ల కొంత ఆందోళన చెందేవాడట. కాగా గత పద్నాలుగు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న భాను కిరణ్ శనివారం డబ్బుల కోసం వచ్చి సిఐడి పోలీసులకు దొరికి పోయిన విషయం తెలిసిందే.