భాను కిరణ్ అరెస్టు

 భాను కిరణ్ అరెస్టు

 మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సిఐడి అధికారి రమణమూర్తి ధ్రువీకరించినట్లు తెలుగు టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి ముంబై మీదుగా హైదరాబాద్ వస్తుండగా జహీరాబాద్ సమీపంలో భాను కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 2011 జనవరి 3వ తేదీన మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన తర్వాత పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. 

తాము పట్టుకున్న ప్రదేశం నుంచి పోలీసులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భాను కిరణ్ మారువేషాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాదు మధ్య తిరుగుతున్న సమయంలో గాలం వేసి పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం తన అనుచరుడు భాను కిరణ్ లేఖలు రాస్తూ వచ్చాడని, ఆ లేఖల ద్వారానే భాను కిరణ్ ఆచూకీ తెలిసిందని అంటున్నారు. 

సూరిని హత్య చేసిన తర్వాత భాను కిరణ్ పారిపోయాడు. ఆర్థిక లావాదేవీల కారణంగానే భాను సూరిని హత్య చేసినట్లు తెలుస్తోంది. సూరి భాను కిరణ్‌ను తీవ్రంగా వేధించాడని, దాన్ని తట్టుకోలేక భాను సూరిని హత్య చేశాడని చెబుతూ వస్తున్నారు. భాను కిరణ్ అరెస్టుతో అసలు విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. 

సూరితో పాటు కారులో వెనక సీట్లో భాను కిరణ్ వెనక సీట్లో కూర్చున్నాడని, ముందు సీట్లో ఉన్న సూరిని భాను కిరణ్ కాల్చి చంపాడని కారు డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. సూరికి భాను కిరణ్ ప్రధాన అనుచరుడిగా పనిచేస్తూ వచ్చాడు. సూరి జైలులో ఉండగా అతని పేరు మీద భాను కిరణ్ సెటిల్మెంట్లు చేస్తూ వచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఏడాదిన్నరగా పోలీసులను భాను కిరణ్ ముప్పు తిప్పలు పెడుతూ వస్తున్నాడు. 

సూరి హత్య జరిగినప్పుడు అతనితో పాటు కారు డ్రైవర్ మధుమోహన్, భాను కిరణ్ మాత్రమే కారులో ఉన్నారు. సూరి హత్య తర్వాత సూరి దేశంలోని పలు ప్రాంతాల్లో సంచరించినట్లు వార్తలు వచ్చాయి. భానును పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. మూడు సార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు.