మూడో కృష్ణుడు రావొచ్చన్న వెంకయ్య

మూడో కృష్ణుడు రావొచ్చన్న వెంకయ్య

 కాంగ్రెస్ వ్యవహారాలు, రాష్ట్ర ప్రభుత్వ పాలనను చక్కబెట్టడం కోసం రాష్ట్రానికి మూడో కృష్ణుడు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు గురువారం ఎద్దేవా చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్నారని, కానీ ఆయన పని అయిపోయిందన్నారు. దాంతో రెండో కృష్ణుడిగా ఇప్పుడు వయలార్ రవి రంగంలోకి దిగారన్నారు.

ఆయన తరువాత మూడో కృష్ణుడూ వచ్చే అవకాశమూ ఉందని చురక వేశారు. అయినా రాష్ట్రంలో పాలన మాత్రం గాడిలో పడటం లేదన్నారు. కాంగ్రెస్ కుమ్ములాటలు రాష్ట్రానికి శాపంగా మారుతున్నాయని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ చెత్త పాలనకు మన రాష్ట్రమే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. పరిపాలన సాగించడంలో కాంగ్రెస్ నేతలకు అవగాహన, చిత్తశుద్ధి లేదని వెంకయ్య ఎత్తి పొడిచారు. కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం, సమైక్యత కొరవడిందన్నారు.

దేశంలో మూడో కూటమి ఏర్పడటం కల్ల అని అయన జోస్యం చెప్పారు. థర్డ్ ఫ్రంట్‌కు ఎప్పుడూ అనుకూలంగా ఉండే వామపక్షాలే ఈసారి దానిని వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. మూడో కూటమి ప్రస్తావన తీసుకొస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఏమో అధికార కాంగ్రెస్‌తో చెట్టపట్టాల్ వేసుకొని తిరుగుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో మరో కూటమి ఏర్పడటం సాధ్యం కాదని అని తేల్చి చెప్పారు.

2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ నగర పాలికకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే బిజెపికి అనుకూల, కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనడానికి నిదర్శనమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనా రెడ్డిలతో కలిసి గురువారం ఇక్కడ విలేకరులతో వెంకయ్య నాయుడు మాట్లాడారు.

కాగా గతంలో రాష్ట్రానికి మూడో కృష్ణుడు, నాలుగో కృష్ణుడు వస్తాడని ముఖ్యమంత్రి పదవి విషయంలో చెప్పారు. ఇప్పుడు పార్టీ ఇంచార్జ్ గురించి చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో చేతివృత్తులను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వేరుగా అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన చేనేత సమర భేరి వీడియో సిడిని ఆవిష్కరించారు.