ఫైనాన్స్ వల్ల కాదని కొట్టిపారేసిన నాగ్

ఫైనాన్స్ వల్ల కాదని కొట్టిపారేసిన నాగ్

నాగార్జున తాజా చిత్రం ఢమురకం ఫైనాన్సియల్ ట్రబుల్స్ లో చిక్కుకుందని, నాగార్జున మార్కెట్ ని మించి విపరీతంగా ఖర్చుపెట్టడం సినిమాకు ఇబ్బందిగా మారిందంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఓ ఇంగ్లీష్ డైలీ వారు నాగార్జునని ఈ విషయమై ప్రశ్నించారు. దానికి నాగార్జున నవ్వుతూ కొట్టిపారేసారు. అలాంటిదేమీలేదని, కేవలం గ్రాఫిక్స్ వల్ల సినిమా లేటవటం తప్ప మరేమీ కాదని అన్నారు. అలాగే సినిమా డిసెంబర్ లోనే పూర్తైపోయినప్పటికీ, అప్పటినుంచి గ్రాఫిక్స్ టీమ్ పనిచేస్తోందని వివరించారు. జూన్ కి సినిమా రెడీ అవుతుందని, తన కెరీర్ లో మంచి సినిమాగా మిగులుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

. అలాగే ఈ చిత్రంలో దాదాపు గంటసేపు గ్రాఫిక్స్ ఉంటాయని,తెలుగు తెరపై ఇప్పటివరకూ చూడని విధంగా వాటిని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఫస్టాఫ్ మొత్తం కామిడీగా సాగినా,ఇంటర్వెల్ అదిరిపోతుందని చెప్తున్నారు. ఇంటర్వెల్ సీన్స్ కాశీలో చిత్రీకరించారు. అలాగే ఈ ఢమురకం లో అరుంధతి తరహా ఆఘోరా పాత్ర ఉన్నట్లు సమాచారం. అరుంధతిలో సోనూసూద్ కి డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ ఈ పాత్రను ఈ సినిమాలో పోషిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ పాత్ర ఇంటర్వెల్ దగ్గర ఇచ్చే ట్విస్ట్ సినిమాకి కీలకమై నిలుస్తుందని చెప్పుకుంటున్నారు.

నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో షూటింగ్ జరుగుతున్న  ఢమరుకం  చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. రక్త చరిత్రలో చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్ గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరిగే పోరాటమే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది.

ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు. ఇక  నాగార్జున  పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.