జగన్ కేసుపై సిబిఐ జెడి వివరణ

జగన్ కేసుపై సిబిఐ జెడి వివరణ

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో లభించిన సాక్ష్యాల ఆధారంగానే తాము కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశామని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఆదివారం స్పష్టం చేశారు. ఆధారాలను బట్టే ఛార్జీషీట్ దాఖలు ఉంటుందని అన్నారు. ఈ కేసులో ఛార్జీషీట్ బలహీనంగా ఉందన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. మాది విచారణ సంస్థ అని, అలాంటి ఆరోపణలు సరికాదన్నారు. కేసు పూర్తయ్యే వరకు విడతల వారీగా ఛార్జీషీట్ దాఖలు చేస్తామని అన్నారు. నిన్నటి ఛార్జీషీట్‌లో సామాజిక వర్గం కోణం ఆలోచించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన అంధత్వ నివారణ వాక్‌లో పొల్గొన్నారు.

కాగా జగన్ ఆస్తుల కేసులో సిబిఐ శనివారం కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఛార్జీషీట్‌లో మొత్తం పదమూడు మందిని నిందితులుగా పేర్కొంది. జగన్ పేరును ఎ-1 నిందితుడిగా, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని ఎ-2 నిందితుడిగా పేర్కొంది. ఛార్జీషీట్ దాఖలు చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెసు తప్పు పట్టగా, ఛార్జీషీట్ సంపూర్ణంగా లేదని తెలుగుదేశం పార్టీ విమర్శించిన విషయం తెలిసిందే.