దేనికైనా సిద్ధమే: తెలంగాణ ఎంపీలు

దేనికైనా సిద్ధమే: తెలంగాణ ఎంపీలు

 తెలంగాణ కోసం తాము భయపడేది లేదని, ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని లోకసభ నుంచి సస్పెండ్ అయిన తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రకటించారు. తెలంగాణ అంశంపై సభా కార్యక్రమాలను స్తంభింపజేయడంతో ఎనిమిది అధికార కాంగ్రెసు పార్టీ లోకసభ సభ్యులను లోకసభ సభ్యులు నాలుగు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన అనంతరం వారు మంగళవారం ధర్నా చేశారు. సస్పెండ్ అయినందుకు తమకు భాధ లేదని, తృప్తిగా ఉందని బలరాం నాయక్ అన్నారు. 

తమకు పదవులు ముఖ్యం కాదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అన్నారు. అధికార పార్టీ సభ్యులమై ఉండి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం పోరాటం చేసి సస్పెండ్ అయ్యామని మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ సాధన కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. తాము దేనికీ భయపడేది లేదని ఆయన అన్నారు. 

అధికార పార్టీకి చెందిన 8 మంది సభ్యులను సస్పెండ్ చేయడమంటే ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో పార్లమెంటు నుంచి అధికార పార్టీ సభ్యులను సస్పెండ్ చేయలేదని, ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. సస్పెన్షన్లకు, బహిష్కరణలకు భయపడబోమని తాము తమ పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు ఆయన తెలిపారు. సభ వాయిదా పడిన తర్వాత వెల్‌లో కూర్చోవడం నిబంధనలకు విరుద్ధమని, డిమాండ్లు న్యాయమైనవని, కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్తామని స్పీకర్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి బన్సాల్ సమక్షంలో చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడడం అనివార్యమని ఆయన అన్నారు. అధిష్టానం ఒత్తిడికి లొంగకుండా తాము పోరాటం చేశామని, తెలంగాణ ఏర్పడే వరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. 

ఏ ఒత్తిడి వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా తాము వెనక్కి తగ్దేది లేదని జి. వివేక్ చెప్పారు. వాయలార్ రవి తమతో మాట్లాడినప్పుడు కూడా పార్లమెంటును స్తంభింపజేస్తామని తాము స్పష్టంగా చెప్పినట్లు ఆయన తెలిపారు. గత 20 రోజుల్లో తెలంగాణ కోసం 15 మంది చనిపోయారని ఆయన గుర్తు చేశారు. సస్పెండ్ చేయబోతున్నారని చెప్పినా తాము వెనక్కి తగ్గకుండా లోకసభ కార్యక్రమాలను స్తంభింపజేశామని ఆయన చెప్పారు. సస్పెన్షన్ చిన్న విషయమని, ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. రేపు కూడా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షను సభలో వెల్లడించడంలో తాము విజయం సాధించామని పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలోనే తాము గట్టిగా మాట్లాడామని, లోకసభను స్తంభింపజేశామని ఆయన చెప్పారు. బిజెపి తీరును ఆయన తప్పు పట్టారు. తెలంగాణ ఇస్తామని చెబుతున్న బిజెపి తమ సస్పెన్షన్‌కు ప్రతిపాదించిన తీర్మానాన్ని బలపరిచిందని, ఇది రెండు నాల్కల ధోరణి ఆయన అన్నారు. మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు బిజెపి తెలంగాణ ఇవ్వలేదని, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యే వరకు పోరాటం సాగుతుందని ఆయన చెప్పారు. సోమవారం లోకసభను మళ్లీ స్తంభింపజేస్తామని ఆయన చెప్పారు. 

ఆత్మహత్యలు చేసుకోవద్దని పొన్నం ప్రభాకర్ తెలంగాణ యువతకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం శాంతియుత ఉద్యమంలో భాగస్వాములు కావాలని, లేదంటే భగత్సింగ్ మాదిరిగా పోరాడాలని, కానీ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఆయన అన్నారు. లోకసభ నుంచి సస్పెండ్ అయిన 8 మంది పార్లమెంటు సభ్యులను కె. కేశవరావు అభినందించారు. పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడమంటే ప్రజల గొంతును సస్పెండ్ చేయడమేనని ఆయన అన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే పార్లమెంటు సభ్యులు అడుగుతున్నారని ఆయన అన్నారు.