జగన్‌కు, మాకే పోటీ:ఎర్రబెల్లి

జగన్‌కు, మాకే పోటీ:ఎర్రబెల్లి

 రానున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, టిడిపి మధ్యే పోటీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు గురువారం అన్నారు. ఆయన కరీంనగర్ జిల్లాలోని శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో టిడిపి, జగన్ పార్టీల మధ్యే పోటీ అన్నారు.

పరకాల నుండి మాజీ డిఎస్పీ నళిని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి తరఫున పోటీకి నిలబడితే తాము మద్దతిస్తామని చెప్పారు. తెలంగాణ అంశంపై కేంద్రం దిగి రావాలంటే అన్ని పార్టీలు ఒకేతాటి పైకి రావాలన్నారు. ఐకమత్యంగా ఒకే గుర్తు కింద పోటీ చేయాలని సూచించారు. లేదంటే ఎన్నికలను బహిష్కరించాలన్నారు.

తెలంగాణ అంశంపై టిడిపి లేక ఇవ్వాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పిన పక్షంలో తాము మరో లేఖ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమన్నారు. ఉప ఎన్నికల్లో నాలుగు సీట్లను సునాయాసంగా గెలుస్తామని, మరికొన్నింటిలోకష్టపడితే మా పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. తెలంగాణ కోసం ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తేవాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం సమావేశమై నిర్ణయిస్తామన్నారు.

మద్యం సిండికేట్ల విచారణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతిపిత మహాత్మా గాంధీకి తమ్ముడిలా మాట్లాడుతున్నారని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే కాంగ్రెసు పాలన అన్నారు.