వైవిధ్యంగా గబ్బర్ సింగ్ ఆడియో

వైవిధ్యంగా గబ్బర్ సింగ్ ఆడియో

‘గబ్బర్ సింగ్' ఆడియో వేడుక కనీవినీ ఎరుగని రీతిలో జరుగబోతోంది. ఒకే రోజు మూడు నగరాల్లో(హైదరాబాద్, విశాఖ పట్నం, తిరుపతి) ఆడియో వేడుకను ప్లాన్ చేశారు ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఇందు కోసం నిర్మాత ప్రత్యేకంగా ఓ ప్రైవేట్ జెట్ విమానాన్ని బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 15వ తేదీన ఆడియో వేడుక జరుగనుంది.

తొలుత ‘గబ్బర్ సింగ్' టీం హైదరాబాద్ నుంచి ఉదయం విమానంలో తిరుపతి చేరుకుంటారు. అక్కడ శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ పాటను విడుదల చేయనున్నారు. అక్కడ కార్యక్రమం పూర్తవగానే మళ్లీ విమానంలో నేరుగా విశాఖ చేరుకుని అక్కడ మరో పాటను విడుదల చేయనున్నారు. సాయంత్రానికి మళ్లీ హైదరాబాద్ చేరుకని ఇక్కడ గ్రాండ్‌గా అన్ని పాటలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

తిరుపతి, విశాఖలో జరిగే వేడుకలో భారీగా మెగా అభిమానులు పాల్గొననున్నారు. హైదరాబాద్‌లో జరిగే వేడుకలో పలువురు అగ్రహీరోలు, టాప్ డైరెక్టర్లు, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న ఈ ఆడియో వేడుక కోసం నిర్మాత గణేష్ ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టారని, ఎలాంటి అంతరాయం కలుగకుండా ప్రీప్లాన్డ్‌గా షెడ్యూల్ రూపొందించారని చర్చించుకుంటున్నారు.

కోట శ్రీనివాసరావు, అభిమన్యుసింగ్, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, కాశీభట్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, వేగేశ్న సతీష్, నిర్మాత: బండ్ల గణేష్, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరీష్‌శంకర్ ఎస్.