హన్సిక చేతిలో 7 సినిమాలు

హన్సిక చేతిలో 7 సినిమాలు

‘‘మీరాకి మీరు మంచి మార్కులేశారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కృషికి తగ్గ ఫలితం లభించినప్పుడు ఆ ఆనందం ఎలా ఉంటుందో ఇప్పటికే పలు చిత్రాల విజయాలు నాకు తెలియజేశాయి. ఇప్పుడు మరోసారి ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నా'' అన్నారు హన్సిక. ఈ బ్యూటీని ఇంత ఆనందానికి గురి చేసిన చిత్రం ‘ఓకేఓకే'. పేరు ఎక్కడా విన్నట్లు లేదే అనుకుంటున్నారా? ఇది తమిళ చిత్రం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్, హన్సిక జంటగా రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలయ్యింది. 

ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభించడంతోపాటు హన్సిక చేసిన పాత్రకు కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ హన్సికపై విధంగా స్పందించారు. ఇంకా ఈ బ్యూటీ మాట్లాడుతూ -‘‘ఓకేఓకేలో నేను మీరా పాత్ర చేశాను. ఈ చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాత మీరాకి దూరమయ్యామే అనిపించింది. అంతగా ఈ పాత్రలో ఒదిగిపోయాను'' అని చెప్పారు. తమిళంలో హన్సిక అందుకున్న నాలుగవ విజయం ఇది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం హన్సిక చేతిలో 7 సినిమాలున్నాయి. వాటిలో విష్ణు సరసన ఒక తెలుగు సినిమా చేస్తున్నారు. 

అలాగే, త్వరలో బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఒక సినిమా అంగీకరించారు. ఇంకా తమిళంలో శింబుతో రెండు సినిమాలు, సూర్య సరసన ఒక సినిమా, ఆర్యతో ఒక సినిమా, ఇంకా పేరు (మరో హీరో) ఖరారు కాని ఒక సినిమా చేస్తున్నారు. ఒకేసారి ఇన్ని చిత్రాలా? అని హన్సికను అడిగితే -‘‘ఈ చిత్రాలకు పర్‌ఫెక్ట్‌గా డేట్స్ కేటాయించాను. అందుకని నో ప్రాబ్లమ్. కెరీర్ ఇంత బిజీగా ఉండటం ఆనందంగా ఉంది. తెలుగు, తమిళ ప్రేక్షకులు అభిమానించడంవల్లే ఇంత జోష్‌గా సినిమాలు చేయగలుగుతున్నాను. అందుకని ప్రేక్షకులకు, నా అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను'' అని చెప్పారు.