జగన్, హరికృష్ణలకు బొత్స కౌంటర్

జగన్, హరికృష్ణలకు బొత్స కౌంటర్

 దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఉందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం న్యూఢిల్లీలో అన్నారు. మంత్రివర్గంలో జరిగే నిర్ణయాలకు కేబినెట్ బాధ్యత వహిస్తుందని, తెర వెనుక జరిగే వాటితో మంత్రులకు సంబంధం లేదన్నారు.

వైయస్ సర్కారులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. కొడుకు అవినీతిపరుడు అయితే తండ్రిని అనడం సరికాదన్నారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసమే ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎన్నిక ఉంటుందన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెసుకు ప్రథమ స్థానమని, టిడిపి మూడోస్థానంలో ఉంటుందన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ ఎన్నికల ప్రచారానికి వస్తారన్నారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసి కట్టుగానే ఉన్నామని చెప్పారు. ఉప ఎన్నికల బాధ్యత అందరిదీ అన్నారు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో రేపటి నుండి పర్యటనలు ఉంటాయని చెప్పారు. ఫలితాలతో ప్రభుత్వానికి ఇబ్బంది లేదన్నారు. గ్రామస్థాయి నుండి కాంగ్రెసు ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసేందుకు ఏం చేస్తే బాగుంటుందో చర్చించామన్నారు.

సంస్థాగతంగా పార్టీని ఏవిధంగా బలోపేతం చేయాలో చర్చించామన్నారు. అందుకు ఓ కార్యాచరణ రూపొందించుకున్నామని చెప్పారు. పార్టీ పదవులు త్వరగా భర్తీ చేయాలని నిర్ణయించమన్నారు. మీడియాలో వచ్చిన కథనాల వల్ల పార్టీ శ్రేణులు కొంత గందరగోళానికి గురయ్యాయన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని విజయం దిశగా నడిపించడమే మా ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు.

ఎసిబి జెడి శ్రీనివాస్ బదలీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయనను మిట్టమధ్యాహ్నం బదలీ చేశారా, అర్ధరాత్రి బదలీ చేశారా తనకేం తెలుసున్నారు. ఆ విషయాలను అధికారులను అడగాలన్నారు. అసలు ఆయన తనకు తెలియదన్నారు. శ్రీనివాస రెడ్డికి ప్రమోషన్ ఇవ్వడం బలిపశువును చెయ్యడమా అని ప్రశ్నించారు. ఇంకోసారి ఈ అంశం మాట్లాడితే నో కామెంట్ అని వెళతానన్నారు. తనను పార్టీ వ్యవహారాల గురించి అడగాలన్నారు. లిక్కర్ విషయంలో మాత్రం తనను టార్గెట్ చేసినందుకు మాత్రం తాను అవేదన చెందానన్నారు. ముఖ్యమంత్రితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కాంగ్రెసులో వ్యక్తుల కన్నా పార్టీ ప్రయోజనాలు ముఖ్యమన్నారు.

తెలంగాణ అంశం సున్నితమైనదన్నారు. ఆ అంశంపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం దీర్ఘకాలిక ప్రయోజనాలతో ముందుకెళుతుందన్నారు. సమైక్యమైనా, తెలంగాణ అయినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ విషయంలో అన్ని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటామన్నారు. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన నీతిమంతులు కాదని జగన్ పార్టీని ఉద్దేశించి అన్నారు.

కాంగ్రెసు నాటకాల పార్టీ అన్న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ వ్యాఖ్యల పైనా బొత్స కౌంటర్ ఇచ్చారు. హరికృష్ణ మొదట టిడిపిలోని కుమ్ములాటలు చూసుకోవాలన్నారు. కాంగ్రెసులో నాటకాలరాయుళ్లు లేరన్నారు. తనకు నాటకాలు వేయడం రాదని ఎద్దేవా చేశారు. తమ పార్టీలో కూడా నాటకాలు వేసే వాళ్లు లేరన్నారు. టిడిపిలోనే నాటకాలు వేసే వాళ్లు ఉన్నారన్నారు. అది డ్రామా ఆర్టిస్టుల పార్టీ అని విమర్శించారు.