నన్నెందుకు అరెస్టు చేస్తారు?:జగన్

నన్నెందుకు అరెస్టు చేస్తారు?:జగన్

 తనను ఎందుకు అరెస్టు చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం జాతీయ ఛానల్ సిఎన్ఎన్-ఐబిఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. రాజకీయంగా తనను అంతమొందించేవిధంగా సిబిఐ దర్యాఫ్తు సాగిస్తోందని ఆయన విమర్శించారు. ఆ సంస్థ చేస్తున్న విచారణలో వృత్తిపరమైన నిబద్ధత ఏమాత్రం లేదని మండిపడ్డారు. మొదట వారి ఆలోచన తీరు మార్చుకోవాలన్నారు.

ఎవరో తమ దారికి రాలేదనో ఎవరో కొందరు ఒక పార్టీని వదిలి వెళ్లారనో వారిని సాధించే విధంగా విచారణ సాగుతోందన్నారు. ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీలు ఉన్నామా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాఫ్తు వివరాలను సిబిఐ తాను ఎంపిక చేసుకున్న పత్రికలు, మీడియా సంస్థలకు లీకు చేస్తోందని విమర్శించారు. 26 జివోలపై కోర్టులో సవాల్ చేసిన అడ్వోకేట్ జనరల్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

మాజీ మంత్రి శంకర రావు వేసిన కేసులో తాను 53వ ప్రతివాదినని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తొలి ప్రతివాది, పలువురు ప్రిన్సిపల్ కార్యదర్శులు ఆ తర్వాత వస్తారని, కానీ సిబిఐ వారి జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. శంకర రావు హైకోర్టుకు లేఖ రాస్తే టిడిపి అందులో ప్రతివాదులుగా చేరారని, దీన్ని బట్టే వారి రాజకీయ ఉద్దేశ్యం అర్థమవుతోందన్నారు. వైయస్ ఎప్పుడూ తప్పు చేయలేదని, అంతకుముందు పాలకుల విధానాలనే అనుసరించారన్నారు.

తనను ఎవరైనా ఎందుకు అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. తాను ఏ ఐఏఎస్ అధికారికైనా, మంత్రికైనా ఫోన్ చేశానా, సచివాలయానికి ఎప్పుడైనా వెళ్లి వారిని ప్రభావితం చేశానా అని అడిగారు. అసలు అరెస్టు విషయం ఎందుకొస్తుందన్నారు. ఆ విషయం సిబిఐ ఏమైనా లీక్ చేసిందా అని ప్రశ్నించారు. తన కేసులో సిబిఐ చేసిందంతా తప్పేనని ఆరోపించారు. ఎనిమిది నెలల పాటు విచారణ జరిపాక లోపభూయిష్టంగా ఉందని కథనాలు వచ్చాక ఇప్పుడు అదనపు ఛార్జీషీట్ అంటోందన్నారు. అవి కూడా ఎన్ని వేస్తారో దేవుడికి తెలియాలన్నారు.

ఈ పోరాటం ఎంత కాలం కొనసాగుతుందో తెలియదని, అయితే తనకు కోర్టులపై నమ్మకం ఉందన్నారు. తాను కాంగ్రెసు పార్టీని వీడగానే తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆ పార్టీలోని కొందరు వ్యక్తులకు అగౌరవనీయుడయ్యాడా అని ప్రశ్నించారు. తాను కాంగ్రెసును వీడిన నెలరోజులకే వేధింపులు మొదలయ్యాయన్నారు. తాను ఏ పరిస్థితుల్లో బయటకు వచ్చానో అందరికీ తెలుసన్నారు. తనను రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది తన తండ్రి వైయస్ అన్నారు. తన వెంట ప్రజలు ఉన్నారన్నారు.

రాష్ట్రంలో మేం ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ లోకసభ స్థానాలు వస్తే తాను కేంద్రంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖను చేపడతానన్నారు. ఇంకా ఎక్కువ సీట్లు వస్తే రైల్వే శాఖ కోరతానన్నారు. జాతీయ స్థాయిలో బిజెపితో కలవబోమని చెప్పారు. సాక్షి మెరుగైన పత్రిక కాబట్టే పెట్టుబడులు పెట్టారన్నారు. నష్టాల్లో ఉన్న ఈనాడులోకి పెట్టుబడులు వచ్చినప్పుడు తప్పు కానప్పుడు తన పత్రికలోకి పెట్టుబడులు వస్తే తప్పేమిటన్నారు.