జెనీలియాకు హైకోర్టు నోటీసులు

జెనీలియాకు హైకోర్టు నోటీసులు

జెనీలియాకు హై కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ యాడ్‌లో నటించినందుకుగాను ఆమె మెడకు కేసు చుట్టుకున్న సంగతి తెలిసిందే. యాడ్‌లో నటించడం ద్వారా నమ్మకం ద్రోహం చేశారని ఆమెపై అభియోగం ఉంది. జెనీలియాపై కేసు నమోదు చేయాలని గతంలోనే నాంపల్లి కోర్టు సైఫాబాద్ పోలీసులను ఆదేశింది. అయితే పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో బాధితులు ఈ సారి హైకోర్టును కోర్టును ఆశ్రయించారు.

జెనీలియా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అంజని పుత్ర ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కస్టమర్లను రూ. కోట్లలో మోసం చేసింది. దీంతో నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. జనీలియా ఆ సంస్థలో డైరెక్టర్‌గా ఉండటంతో పాటు, ఆమె ప్రచారం చేయడం వల్లనే తాము ఆ సంస్థను నమ్మి ఫ్లాట్ల కోసం డబ్బులు చెల్లించామని, జెనీలియా తమను తప్పుతోవ పట్టించిందని, సంస్థ చేసిన మోసానికి పూర్తిగా జెనీలియా బాధ్యత వహించాలని బాధితులు అంటున్నారు.

సదరు సంస్థ ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పి కస్టమర్ల నుంచి రెండేళ్ల క్రితం రూ. వందల కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే జెనీలియా ఇటీవలే కేంద్రమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుడు రితేష్ దేష్ ముఖ్ ను పెళ్లి చేసుకోవడం, ఆమె హైదరాబాద్‌లో అందుబాటులో లేక పోవడతో పోలీసులు ఇంతకాలం ఆ కేసు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. 

కాగా జెనీలియా మాత్రం ఈ కేసును లైట్ గా తీసుకుంటున్నట్లే స్పష్టం అవుతోంది. వారు యాడ్ చిత్రీకరణ చేస్తామంటే... రెమ్యూనరేషన్ తీసుకుని నటించాను, అంతే కానీ ఆ కంపెనీ చేసే మోసాలకు నాకేంటి సంబంధం అని తన సన్నిహితుల వద్ద అంటోందట.