లీకు గ్రీకువీరుడు బొత్సనే

లీకు గ్రీకువీరుడు బొత్సనే

 ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియాకు లీక్ చేస్తోంది పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే అని అంటున్నారు. తనకూ ముఖ్యమంత్రికి మధ్య విభేదాల వార్తలకు కారకుడు ఆయనే అని కాంగ్రెసు సీనియర్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అంతర్గత వ్యవహారాలను తెలివిగా మీడియాకు అందిస్తున్నారని అంటున్నారు. పైగా మీడియానే స్పర్థల వార్తలు సృష్టిస్తోందని తప్పు పడుతున్నారు.

ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బొత్స సత్యనారాయణ లీక్ చేసిన విషయాలను ఆంగ్లంలోకి అనువాదం చేసిన కాంగ్రెసు సీనియర్లు కొంత మంది పార్టీ అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి మీడియాతో ఉన్న సంబంధాలపై, ఇందుకు సంబంధించి ఇద్దరు ప్రముఖులు అనుసరిస్తున్న వైఖరిపై వారు పార్టీ అధిష్టానానికి నివేదిక పంపించారని అంటున్నారు. పైగా తమకు, ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు సృష్టించవద్దని బొత్స సత్యనారాయణపై అనడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఓ మీడియా సంస్థకు స్వయంగా బొత్స సత్యనారాయణ ఫోన్ చేసి వివరాలు అందిస్తున్నారని అంటున్నారు. గతంలో తొలి సమన్వయ కమిటీ సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విరుచుకుపడిన వివరాలను ఆయనే ఓ తెలుగు దినపత్రిక చెవిన వేశారని చెబుతున్నారు. అలా వార్తలను పత్రికలను లీక్ చేస్తూ మరుసటి రోజు తాను అలా అనలేదని అధికారికంగా చెబుతూ వస్తున్నారని అంటున్నారు. 

తనకు అండగా నిలుస్తున్న ఓ మీడియా సంస్థకు ఆయన విషయాలను లీక్ చేయడం వల్ల మీడియాలో కూడా విభేదాలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. తాను పార్టీ అధ్యక్షురాలు సోనియాకు రాసిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారని అంటున్నారు. బొత్స లేఖ మీడియాకు లీక్ కాబోతున్నట్లు మధ్యాహ్నం నుంచే ప్రచారం జరిగింది. అ ప్రచారమే నిజమైంది. దానికితోడు, ముఖ్యమంత్రిని దెబ్బ తీయడానికి అసమ్మతి నాయకులను తన నివాసానికి పిలిపించుకుని తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్నారని అంటున్నారు.