తారా చౌదరి కేసుపై ప్రత్యేక దృష్టి

 తారా చౌదరి కేసుపై ప్రత్యేక దృష్టి

 వ్యభిచార రాకెట్ తారా చౌదరి కేసులో బంజారాహిల్స్ పోలీసులకు ఉన్నతాధికారులు మార్గదర్శకాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. తారా వ్యవహారాన్ని పోలీస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఆమె ఇంట్లో లభించిన సాక్ష్యాధారాలు, ఇతర అంశాలకు సంబంధించి కేసు మరింత బలంగా ఉండేలా రుజువులు సేకరించాలని అధికారులు బంజారాహిల్స్ పోలీసులకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రముఖులు, రాజకీయ నాయకులు ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఖచ్చితమైన సాక్ష్యాధారాలు సేకరించమని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

తారా చౌదరి ఉదంతం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ పోలీసులు ఇప్పటి వరకు ఆమెపై ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతులను మభ్యపెట్టి వ్యభిచార రొంపిలోకి దింపిందనే అభియోగంపై సాక్ష్యాధారాలు సేకరించి ఆమెపై కేసు పెట్టారు. అయితే ఐదారేళ్లుగా ఆమె సాగిస్తున్న కార్యకలాపాలతో ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి పైనా పోలీసులు కొన్ని సాక్ష్యాలు సేకరించినట్లుగా తెలుస్తోంది.

ఆమె ఇంట్లో లభించిన సిడిలు, ల్యాప్‌టాప్‌లను రుజువుగా పోలీసులు చూపిస్తున్నారట. అయితే అందులో ప్రముఖుల తప్పులు రుజువు చేసేందుకు పూర్తి స్థాయిలో ఆధారాలు లేవని అధికారులు గ్రహించారట. ఆ లోపాల ఆధారంగా పోలీసులపై భవిష్యత్తులో ఒత్తిడి పెరుగవచ్చునని, కాబట్టి ముందే పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు సేకరిస్తేనే బాగుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారట.

అంతేకాకుండా తారా చౌదరి అరెస్టు, కస్టడీ విషయాలలో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడం పట్ల అధికారులు అసంతృప్తితో ఉన్నారట. అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపుతోందని, తారా కేసులో పలువురు ప్రముఖులు ఉన్నారని మీడియాలో రావడాన్ని కూడా వారు జీర్ణించుకోవడం లేదట.

తారా అరెస్టు కరెక్టే అయినప్పటికీ ప్రచారం ద్వారా కేసు పక్కదారి పట్టే అవకాశముందని అధికారులు సూచించారట. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తదితరులతో తారా చౌదరికి సంబంధాలు ఉన్నట్టు రుజువు చేసేందుకు మరింత పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించాలని, వీలైనంత త్వరగా వీటిని అందుబాటులో ఉంచుకుంటే బాగుంటుందని సూచించినట్లుగా సమాచారం.