జగన్‌తో ఏకీభవిస్తున్న సిఎం కిరణ్?

జగన్‌తో ఏకీభవిస్తున్న సిఎం కిరణ్?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారా? అనే ప్రశ్న ఇప్పుడు కాంగ్రెసు నేతలను వెంటాడుతోందని అంటున్నారు. జగన్ కాంగ్రెసు పార్టీ వీడి వైయస్సార్ కాంగ్రెసు పేరుతో సొంత కుంపటి పెట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ ఆయనపై చేసిన విమర్శలు చాలా చాలా తక్కువ. అయితే ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు.

ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నలభై ఏళ్లు కష్టపడి ఇటుక ఇటుక పేర్చి కాంగ్రెసు పార్టీని బలోపేతం చేసి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారని, ఆయన ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా జగన్ కాంగ్రెసు పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు.

ఆయన జగన్‌ను విమర్శించేందుకు ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ పార్టీలో మాత్రం చర్చ జరుగుతోందట. వైయస్ పేరును ఎంత ఉపయోగిస్తే అంతగా జగన్‌కు లబ్ధి చేకూరుతుందని, ఇలాంటి సమయంలో కిరణ్ దివంగత వైయస్‌ను నలభై ఏళ్లుగా అంటూ పొగడటం ఏమిటని చర్చించుకుంటున్నారట. ఓ వైపు వైయస్ పేరును, ఫోటోను ఉపయోగించుకోవద్దనే చర్చ పార్టీలో తీవ్రంగా జరుగుతున్న సమయంలో కిరణ్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని విమర్శిస్తున్నారట.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు పలు ఉదాహారణలు చూపిస్తూ కిరణ్‌ను కాంగ్రెసులో ఉన్న జగన్ కోవర్టుగా పేర్కొంటున్నారు. జగన్ అక్రమాస్తుల పైన కేసు వేసిన మాజీ మంత్రి శంకర రావును కేబినెట్ నుండి బర్తరఫ్ చేయడం, జగన్ పైన ఒంటికాలిపై లేచే మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి శాఖలకు కోత పెట్టడం తదితరాలను టిడిపి చూపిస్తూ సిఎం వైయస్సార్ కాంగ్రెసు చీఫ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ సిఎం జగన్ కోవర్టు కావొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.

వి.హనుమంత రావు, డిఎల్ రవీంద్రా రెడ్డి, ఎమ్మెల్యే వీర శివా రెడ్డి వంటి సీనియర్ పలువురు సీనియర్ నేతలు జగన్ పైన నిత్యం విమర్శలు చేస్తున్నారు. అయితే కిరణ్ ఆయన పైన విమర్శలు చేయకపోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన నేతలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్ విమర్శిస్తే ఉపేక్షిస్తే అర్థం ఉంటుందని, కానీ తనను సిఎం చేసిన సోనియా గాంధీనే జగన్ విమర్శిస్తుంటే కిరణ్ మాట్లాడక పోవడమేమిటని వాపోతున్నారట.