జగన్‌తో సాయిరెడ్డి భేటీ

జగన్‌తో సాయిరెడ్డి భేటీ

జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి శనివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆయన లోటస్‌పాండులో జగన్ నివాసానికి ఉదయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను వైయస్ జగన్ విషయం మాట్లాడబోనని చెప్పారు. వైయస్ జగన్ ఆస్తుల కేసు గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. జైలు జీవితం దుర్భరమైందని ఆయన అన్నారు. సిబిఐ తన పని తాను చేసుకు పోతోందని ఆయన అన్నారు. సిబిఐ తన బాధ్యత నెరవేరుస్తోందని ఆయన చెప్పారు. బెయిల్ ఇచ్చినందుకు ఆయన న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. సిబిఐకి, మీడియాకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనను విడుదల చేసే విషయంలో జైలు అధికారులు నిబంధనలను అతిక్రమించలేదని చెప్పారు. సమయం మించిన తర్వాత తనను జైలు నుంచి విడుదల చేశారనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు. విజయసాయి రెడ్డి బెయిల్‌పై శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఆయనను జనవరి 2వ తేదీన అరెస్టు చేసింది. దాంతో మూడు నెలలపాటు ఆయన చంచల్‌గుడా జైలులో ఉన్నారు. ఆయనకు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సిబిఐ వ్యతిరేకించింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటి వరకు ఒక్క విజయసాయి రెడ్డిని మాత్రమే అరెస్టు చేసింది. అయితే, విచారణలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం సిబిఐ మంత్రి ధర్మాన ప్రసాద రావును సుదీర్ఘంగా విచారించింది. శుక్రవారం పగటి విచారించిన సాయంత్రం మొదలు పెట్టి రాత్రి పొద్దు పోయేవరకు సిబిఐ ధర్మాన ప్రసాద రావును విచారించింది. ధర్మాన ప్రసాదరావు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. దీంతో భూముల కేటాయింపుపై సిబిఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అప్పట్లో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేసిన ఐఎఎస్ అధికారి శామ్యూల్‌ను కూడా సిబిఐ శుక్రవారం విచారించింది.