షేక్‌స్పియర్ కథతో కర్మయోగి

షేక్‌స్పియర్ కథతో కర్మయోగి

మలయాళ సుందరి నిత్యామీనన్ ప్రస్తుతం తన మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, కన్నడ చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే ఆమె అంగీకరిస్తుంటారు. మలయాళంలో ఇటీవల ఆమె నటించిన ఓ చిత్రం ‘కర్మయోగి' పేరిట తెలుగు తెరకు రానుంది. ఇందులో నిత్య కనబర్చిన అభినయానికి మల్లూవుడ్ ప్రేక్షకులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. 

శకుంతల ఆర్ట్స్ పతాకంపై ప్రకాష్‌రావు సనపల సమర్పణలో రాజశేఖర్ సనపల ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇటీవలే డబ్బింగ్ పనులు ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ -‘‘ప్రపంచ ప్రఖ్యాత నవలారచయిత షేక్స్‌పియర్ రచించిన ‘హేమ్లెట్' కథ ఆధారంగా రూపొందిన పీరియాడికల్ ఫిలిమ్ ఇది. 

ఈ చిత్రాన్ని వీకే ప్రకాష్ అద్భుతంగా తెరకెక్కించారు. పలు చలన చిత్రోత్సవాల్లో కూడా ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఇంద్రజిత్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో ప్రముఖ హిందీ నటి పద్మిని కొల్హాపురి ఓ ముఖ్య పాత్ర చేశారు. నిత్యా నటన, ఇంద్రజిత్ చేసిన మల్లయుద్ధ పోరాట సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి'' అని చెప్పారు.