బాలుడి కిడ్నాప్, హత్య

బాలుడి కిడ్నాప్, హత్య

మూడు రోజుల క్రితం అమలాపురంలో బాలుడి కిడ్నాప్ ఘటన విషాదాంతంతో ముగిసింది. వ్యసనాలకు అలవాటు పడిన బాలుడి కుటుంబ మిత్రుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇటీవల నాగ వివేక్ అనే పాఠశాల విద్యార్థి కిడ్నాప్‌కు గురయ్యాడు. అతనిని రవిచంద్ర అనే ఇంజనీరింగ్ విద్యార్థి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు రవిచంద్రను గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

నాగ వివేక్ పాఠశాల నుండి వస్తుండగా రవిచంద్ర అతనిని కిడ్నాప్ చేశాడు. వ్యసనాలకు అలవాటు పడిన రవిచంద్ర రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇచ్చేందుకు కుటుంబం ఒప్పుకున్నప్పటికీ నిందితుడు బాలుడిని అప్పగిస్తానని చెప్పలేదు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు రవిచంద్రను వైజాగ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

బాలుడిని కిడ్నాప్ చేసిన రోజే గొంతు నులిమి హత్య చేసినట్లు రవిచంద్ర విచారణలో ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని తాళ్ల రేవు మండలం కోరంగి చెరువులో శుక్రవారం ఉదయం పోలీసులు కనుగొన్నారు. మృతదేహాన్ని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. మూతికి ప్లాస్టర్ అతికించి అతి కిరాతకంగా చంపాడు. 

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పెరుమాళ్లపల్లిలో గురువారం అర్ధరాత్రి రెండు మిద్దెలు కూలిన ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాసన్న అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, సుబ్రహ్మణ్య రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు. మిగిలిన క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు.

వడమాలపేట ఎస్వీపురం రైల్వేస్టేషన్‌లో ఉషా అనే రైల్వే ఉద్యోగిపై దుండగులు దాడి చేసి నగలు, నగదు అపరించారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం ఉషను ఆసుపత్రికి తరలించారు. 

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం కుంచంగి గ్రామంలో జరిగిన క్వారీ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. లోడ్ చేస్తున్న లారీ అదుపు తప్పి క్వారీ వద్ద నిద్రపోతున్న కార్మికుల పైకి దూసుకు వచ్చింది. ఈ ప్రమాదంలో యశ్వంత్, సూరిబాబు అనే కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

మరోవైపు పాత గుంటూరులో దారుణం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న దంపతులపై అగంతకులు దాడి చేశారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది.