రాజకీయాలంటే నేతలు కాదు: జెపి

రాజకీయాలంటే నేతలు కాదు:  జెపి

 రాజకీయాలు అంటే నేతలు, పార్టీలు కాదని ప్రజా జీవితంతో ముడివడిన అంశాలు అని దీనిని నేటి యువత గుర్తించాలని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ శనివారం అన్నారు. సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజంలో మార్పు కోసం సమయం కేటాయించేందుకు ముందుకొచ్చిన యువత, విద్యార్థుల నుద్దేశించి హైదరాబాద్ లోక్‌సత్తా ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. రాజకీయాల పేరిట గెలుపోటములు, ఓట్ల లెక్కలు వేస్తూ చర్చించుకొంటున్న మనం ప్రజలకు తాగునీరు, వైద్యం, విద్యలాంటి సౌకర్యాల గురించి పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

పార్టీలు, నేతల చుట్టూ తిరిగే రాజకీయాన్ని విడిచిపెట్టి జనజీవితాలతో ముడిపడిన కొత్త రాజకీయాన్ని సాధించేందుకు అవగాహన, అంకితభావంతో యువత కృషిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్ని వన రులున్నా ప్రజలకు తాగునీరు ఇవ్వలేక దిగజారి పోతోందన్నారు. ఉపాధి హామీ పథకం కింద రూ.7-8 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేని స్థితిలో ఉందని విమర్శించారు. విద్యుత్ టారిఫ్ పెంచినప్పుడు గొడవ చేయడం కన్నా అందులో లోపాలను ఎత్తిచూపి వాటిని సరిదిద్దేలా పోరాడాలని యువతకు పిలుపునిచ్చారు.

కాగా అవినీతి నిరోధక శాఖ అదనపు సంచాలకుడు శ్రీనివాస రెడ్డి బదిలీపై త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు లోక్‌సత్తా పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ నేతలు బండారు రామ్మోహన్, భాస్కర్‌ రావు శనివారం విలేకరులతో మాట్లాడారు. అన్ని పార్టీలు ముక్త కంఠంతో వద్దంటున్నా ప్రజాస్వామ్యాన్ని, సుపరిపాలనను పరిహాసం చేసేలా శ్రీనివాస రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసిందని వారు గర్హించారు. బెల్టు షాపులు, కల్తీ, అక్రమమద్యంతో రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలను నాశనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం సిండికేట్లపై చర్యకు సిద్ధమైన అధికారిని బదిలీ చేయడం దారుణమన్నారు.