భాను కిరణ్ అరెస్టుకు ఎవరు సహకరించారు?

భాను కిరణ్ అరెస్టుకు ఎవరు సహకరించారు?

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను పట్టుకోవడానికి సిఐడికి సహకరించింది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. తమకు లభించిన సమాచారం మేరకే భానును పట్టుకున్నామని సిఐడి ఉన్నతాధికారి రమణమూర్తి చెప్పారు. అయితే, సహకరించింది ఎవరనేది వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. 

సూరి హత్య జరిగినప్పుడు కారు డ్రైవర్‌గా పనిచేసిన మధుమోహన్ రెడ్డి సహకరించాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   మద్దెలచెర్వు సూరి  హత్య కేసులో మధుమోహన్ రెడ్డి ఒక్కడే ప్రత్యక్ష సాక్షి అని తెలుస్తోంది. అతను పోలీసులకు భాను జహీరాబాద్ వస్తున్నట్లు సమాచారం అందించాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ వార్తలు వచ్చాయి. 

భాను కిరణ్ వద్ద డబ్బులన్నీ అయిపోవడంతో మధుమోహన్ రెడ్డికి లేఖలు రాశాడని, ఆ సమాచారాన్ని సిఐడికి మధుమోహన్ రెడ్డి అందించాడని, దాంతో ట్రాప్ చేసి జహీరాబాద్ వద్ద సిఐడి పోలీసులు భానును పట్టుకున్నారని అంటున్నారని అంటున్నారు. అయితే, అవి ఊహాగానాలు మాత్రమేనని సిఐడి అధికారులు కొట్టిపారేస్తున్నారు. నిందితుడి కదలికలను పసిగట్టడానికి తమ పద్ధతులు తమకు ఉన్నాయని, ఈ కేసు మిగతా కేసులకు భిన్నమైందేమీ కాదని అంటున్నారు. 

సూరి హత్యకు ముందే పారిపోవడానికి వీలుగా భాను కిరణ్ నాలుగు లక్ష రూపాయలు తన వద్ద పెట్టుకున్నాడని, ఇన్నాళ్లు వాటితో కాలం వెళ్లదీశాడని అంటున్నారు. దాదాపు 14 నెలల పాటు అంటే నిరుడు జనవరి నుంచి భాను కిరణ్‌కు ఆ నాలుగు లక్షల రూపాయలు సరిపోయాయా అనేది అనుమానంగానే ఉందని అంటున్నారు. భాను తరుచుగా తన స్థావరాలను మారుస్తూ వచ్చాడని, దేశంలోని పలు చోట్లకు తిరిగాడని సిఐడి అధికారులే అంటున్నారు. 

సూరిని హత్య చేసిన తర్వాత రాష్ట్రంలో మొదటిసారి అడుగు పెట్టాడని, తాము పట్టుకున్నామని సిఐడి అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ రమణమూర్తి శనివారం చెప్పారు. భాను కిరణ్ కొంత మందితో టచ్‌లో ఉన్నాడని చెప్పిన ఆయన వివరాలు చెప్పలేదు. భాను లొంగిపోయాడనే వార్తలను ఆయన ఖండించారు. అయితే, భాను కిరణ్ మీడియాతో మాట్లాడకుండా సిఐడి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 

ఇదిలావుంటే, భాను కిరణ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిఐడి సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ రేపటికి వాయిదా పడింది.   భాను కిరణ్  చెప్పిన విషయాల్లో నిజాలు ఉన్నాయా, లేదా తేల్చుకోవడానికి భానును తమకు అప్పగించాలని సిఐడి కోర్టును కోరింది.