బాధ్యత ముఖ్యమంత్రిదే:ఆనం

బాధ్యత ముఖ్యమంత్రిదే:ఆనం

విద్యుత్ ఛార్జీల పెంపు బాధ్యత ముఖ్యమంత్రి పరిధిలోనిది అని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఛార్జీల పెంపుపై పార్టీలు, ప్రజా సంఘాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్నారు. విద్యుత్ శాఖ పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలో ఉందని చెప్పారు. దీంతో ఛార్జీల పెంపుపై ఇతర మంత్రుల అభిప్రాయాలు వారి వ్యక్తిగతమని చెప్పారు.

ఛార్జీల పెంపు నామమాత్రమే ఉందని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఛార్జీల పెంపుపై మంత్రి వర్గంలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. పెంపుతో మంత్రులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఛార్జీలు పెంచమని, తగ్గించమని తాను తన వ్యక్తిగత ఉద్దేశ్యాలు సిఎంపై రుద్దనని అన్నారు. పార్టీలు, ప్రజల నుంచి వస్తున్న నిరసనలను సిఎం పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. వీటన్నింటిపై సమీక్ష నిర్వహించి తగు నిర్ణయం తీసుకుంటారన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో ప్రవేశ పెట్టిన గ్రీన్ ఛానల్ విధానం అమలును త్వరలోనే సమీక్షించుకొని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ ఖర్చు చేయనంతంగా అత్యధిక శాతం నిధులను 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసినట్లు చెప్పారు.

2011-12 సంవత్సరానికి గాను 95 శాతం నిధులు ఖర్చు చేశామన్నారు. రాష్ట్ర ఖజానా దివాళా తీయలేదన్నారు. ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లలేదన్నారు. మార్చి 29, 30న లెక్కలు సరి చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. అందువల్లనే జీతాల చెల్లింపులో జాప్యం జరిగిందన్నారు. ఖజానా ఖాళీ అయిందన్న వార్తలు సరికాదన్నారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందన్నారు. ఎప్ఆర్‌బిఎం చట్టానికి అనుగుణంగా ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుందన్నారు.