జగన్ గెలుస్తాడు: టిజి వెంకటేష్

జగన్ గెలుస్తాడు: టిజి వెంకటేష్

చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పుయాత్ర కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. 

ఉప ఎన్నికల లోపు తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్రనష్టం జరుగుతుందని ఆయన అన్నారు. జగన్ ఓదార్పుయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికల లోపు తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టమైన నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు జగన్ గూటికి చేరడం ఖాయమని ఆయన అన్నారు.

ప్రజలు అన్ని పార్టీల పని విధానాన్ని పరిశీలిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ప్రజల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతున్నా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నీతివంతమైన పాలన అందిస్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వెనుకబడుతున్నారని అన్నారు. 

రాయల తెలంగాణ వైపు ప్రజలు ఎక్కువ మొగ్గుచూపుతున్నారని, అయితే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మెజార్టీ ప్రజలు కోరుతున్నందున తాము సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నామన్నారు. మంత్రి టిజి వెంకటేష్ వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులే కాదు, సీమాంధ్ర నాయకులు కూడా కోరుతున్నారు. అయినా, పార్టీ అధిష్టానం అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.