నిత్యమీనన్‌ ' సర్‌ప్రైజ్‌ రోల్‌ '

నిత్యమీనన్‌ ' సర్‌ప్రైజ్‌ రోల్‌ '

 వర్ధమాన తారలు, సాధారణంగా 'గ్లామర్‌ ఇమేజ్‌' కోసం తాపత్రయపడుతుంటారు. పాత్ర సాధారణమైనదే అయినా పారితోషికం భారీగా ఉంటుందంటే, తక్కినవేమీ పట్టించుకోకుండా ఏ భాషా చిత్రమైనా అంగీకరిస్తారు. కానీ, ఇటీవల నిత్యామీనన్‌ అధిక పారితోషికాన్ని 'ఆఫర్‌' చేసే తెలుగు చిత్రాన్నీ, ఓ తమిళ చిత్రాన్నీ వదులుకుని 'మైనా' అనే ఓ కన్నడ చిత్రాన్ని అంగీకరించి, చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకీ ఆ చిత్రంలో ఆమెది వికలాంగురాలి పాత్ర. అంటే మంచినటిగా రాణించాలనే తపనతో కథాబలం ఉన్న ఆ చిత్రాన్ని నిత్యామీనన్‌ అంగీకరించిందన్నమాట! 'మైనా' కు నేపథ్యం నిజంగా జరిగిన కొన్ని సంఘటనలు. ఓ పోలీస్‌ అధికారి తను పరిశోధించిన కొన్ని హత్యానేరాలలోని ఒక కేసు ఆధారంగా ఈ చిత్ర కథను రూపొందించడం జరిగింది. ''ఇది ఒక రకంగా ప్రేమకథే. ఈ కథలో తన ప్రియురాలికోసం నాయకుడు 35 హత్యలు చేస్తాడు...అంటే చేయవలసివస్తుందట. అన్ని హత్యలు చేసినా అతనిపట్ల అందరికీ సానుభూతి కలుగుతుంది కానీ ఆగ్రహం రాదు. ఎందువల్ల అనేదే సస్పెన్స్‌! మరి ఆ అమ్మాయిది అంత పవర్‌ఫుల్‌ పాత్ర కాబట్టి నిత్యామీనన్‌ అయితే సరిగ్గా ఉంటుందని అనుకున్నాం. కథ విని ఆమెకు కూడా నచ్చి అంగీకరించింది'' అని చెప్పారు ఈ చిత్ర దర్శకుడు నాగశేఖర్‌. పోలీస్‌ అధికారి పాత్రలో ప్రసిద్ధ తమిళ నటుడు శరత్‌ కుమార్‌ నటిస్తున్నారు. కన్నడంలో తయారయ్యే ఈ వాస్తవిక కథా చిత్రాన్ని తెలుగు, తమిళం, మళయాళ భాషల్లో కూడా విడుదల చేస్తారట! గ్లామర్‌ రోల్స్‌ వద్దనుకుని వికలాంగురాలి పాత్రలో నటించడానికి అంగీకరించిన నిత్యామీనన్‌ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే!