అందర్నీ మెప్పించే ఒక్కడినే

అందర్నీ మెప్పించే ఒక్కడినే

‘వందమందిలో ఒకడిగా బ్రతకటం గొప్పకాదు.. ఒక్కడే వందమందిని నడిపించడం గొప్ప అనే కాన్సెప్ట్‌తో సీవీరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘ఒక్కడినే'. నారా రోహిత్, నిత్యామీనన్ జంటగా రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీనివాస రాగ దర్శకుడు. నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా గురించి సీవీరెడ్డి మాట్లాడుతూ -‘‘కొన్ని సినిమాల భవితవ్యం నిర్మాణ సమయంలోనే అర్థమైపోతాయి. ఇది తప్పకుండా పెద్ద విజయం సాధించే సినిమా అవుతుంది. టైటిల్‌కి తగ్గ కథ ఇది. కథనం ఈ చిత్రానికి ప్రధాన బలం. 

చక్కని ఫ్యామిలీ డ్రామా. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. దర్శకుడు శ్రీనివాస్ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. రెండు పాటలు, రెండు ఫైట్లు కలుపుకొని 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 23 నుంచి ఆర్‌ఎఫ్‌సీలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాం. సినిమా పూర్తయ్యేవరకూ ఈ షెడ్యూల్ సాగుతుంది'' అని తెలిపారు. కోట శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణన్, నిత్య తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, కెమెరా: ఆండ్రూ.