బాబు పాక్ పోలికపై బొత్స నిప్పులు

బాబు పాక్ పోలికపై బొత్స నిప్పులు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన, ఆ పార్టీ నేతల పైన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స నారాయణ ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా ప్రశాంతమైన జిల్లా అని అక్కడి ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దని, అయినా చంద్రబాబును అడ్డుకుంటానని కాంగ్రెసు నేతలు చెప్పారా అని ఆయన ప్రశ్నించారు. బాబు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని సూచించారు. విలువలతో కూడిన రాజకీయం చేయాలన్నారు.

చంద్రబాబు అధికారం కోసం మామను వెన్ను పోటు పొడిచాడని, తాను అలాంటి దగుల్బాజీ వ్యక్తిని కాదన్నారు. అవినీతితో బాబు రెండెకరాల నుండి కోట్లకు పడగెత్తారని విమర్శించారు. ఎమ్మార్ విల్లాలలో కొడుకు, కోడలుకు ఉన్న విల్లాలు ఎక్కడివని ప్రశ్నించారు. విజయనగరాన్ని బాబు పాకిస్తాన్‌తో పోల్చడం ఎంత వరకు సమంజసమన్నారు. చంద్రబాబు భారీ ఎత్తున అవినీతికి పాల్పడి, అన్నా హజారే కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

అవినీతి బాబు మాకు నీతులు చెప్పడమా అని అన్నారు. విలువలను బాబు తుంగలో తొక్కారన్నారు. బాబును అడ్డుకుంటామని ఎవరూ ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రజల వద్ద సానుభూతి పెంచుకునేందుకు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆయన మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఆయన మాయలు అందరికీ తెలుసని చెప్పారు. టిడిపి చిత్తూరు జిల్లాలో ధర్నా చేయాలని సూచించారు.

తాము విజయనగరంలో ధర్నా చేసేది, అక్కడ టిడిపి నేతలు చేస్తున్న ఆరాచకాలకు వ్యతిరేకంగా అని బొత్స చెప్పారు. వ్యక్తిగత ఆరోపణలకు దిగడం బాబుకు సరికాదన్నారు. బాబుకు తన జిల్లాలో ఎంత పలుకుబడి ఉందో ఎంత సత్తా ఉందో తమకు తెలియదన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకుంటే దానిని తమకు ఎందుకు ఆపాదిస్తారని ప్రశ్నించారు. బాబుకంటే పెద్ద వెన్నుపోటుదారుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అన్నారు.

చంద్రబాబుకు వరంగల్ జిల్లాలో భద్రత ఈ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. జిల్లాలో టిడిపి నేతలు మద్యం షాపులు నడుపుతున్నారని ఆరోపించారు. బాబు వంటి నేత ప్రతిపక్ష నేతగా ఉండటం రాష్ట్రానికి దురదృష్టమన్నారు. అవినీతిపరుడు కాకుంటే కోర్టుల నుండి స్టే బాబు స్టే ఎందుకు తెచ్చుకున్నారన్నారు. టిడిపికి అక్కడా పలుకుబడి లేదని అందుకే కాంగ్రెసు అన్ని సీట్లు గెలుచుకుందన్నారు. పాక్‌తో పోల్చడం వల్ల జిల్లా ప్రజల మనోభావాలను ఆయన దెబ్బతీశారన్నారు.

తనను విజయనగరంలో అడ్డుకోవాలంటే టిడిపి నేతల జేజేమ్మలు దిగి రావాలన్నారు. తనకు అక్కడ మంచి పేరుందని చెప్పారు. తనను అడ్డుకుంటామని చెప్పడం ద్వారా టిడిపి నేతల ఉద్దేశ్యమేమిటో అందరికీ అర్థమైందన్నారు. తాను తప్పులు చేసినట్టు జిల్లాలో నిరూపించగలరా అని సవాల్ విసిరారు. కాగా టిడిపి నేతలను బొత్స పశువులతో పోల్చారు.