ఆ నటుడే 'రచ్చ'కు మైనస్ అయ్యాడు

ఆ నటుడే 'రచ్చ'కు మైనస్ అయ్యాడు

రామ్ చరణ్ తేజ రచ్చ చిత్రం క్రితం గురువారం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మరింత రేంజి హిట్ ని అందుకోకపోవటాకి కారణం అందులో నటించిన పార్ధీపన్ అని కొందరంటున్నారు. తమిళ నటుడు పార్దీపన్ ఇక్కడ వారికి కనెక్టు కాకపోవటంతో ఎమోషనల్ ధ్రెడ్ కనెక్టు కాలేదని వాదిస్తున్నారు. పార్ధీపన్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి తండ్రిగా చేసారు. గతంలో పార్ధీపన్ తెలుగులో చేసి ఉండకపోవటం,ఆయన సినిమాలు సైతం పెద్దగా డబ్బింగ్ కాకపోవటంతో ఆయన తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించి దూరం పెట్టారని చెప్పుకుంటున్నారు.


ఇక పార్ధీపన్ ని రచ్చలో పెట్టడానికి కారణం ...పార్దీపన్ కి తమిళంలో ఉన్న మార్కెట్. ఆయన అక్కడి వారికి అలవాటు పడి ఉండటంతో ఈ సినిమాను అక్కడ సైతం రిలీజ్ చేయాలనే ఆలోచనతో తీసుకున్నారు. ఇక సినిమా సూపర్ హిట్టు అయ్యి ఉంటే ఇలాంటి లోపాలు కొట్టుకుపోయేవని,అలా కాకపోవటంతో అన్ని కనపడుతున్నాయని అంటున్నారు. ఇక రచ్చ చిత్రం మాత్రం ఓపినింగ్,పండగ,వీకెండ్ కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. నిర్మాతలే మొదటి మూడు రోజులు రికార్డు స్ధాయిలో పదిహేను కోట్లు సాధించాయని చెప్తున్నారు.


పక్కా మాస్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్టాఫ్ బాగానే మాస్ టచ్ తో గడిచిపోయినా సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పండలేదు. దానికి తోడు దేవ్ గిల్ పాత్ర వచ్చేసరికి కథ పూర్తైన ఫీలింగ్ వచ్చేయటం కూడా సినిమాకు మైనస్ గా నిలిచిందని విశ్లేషకులు అంటున్నారు. అయితే రామ్ చరణ్ ఒంటి చేత్తో సినిమాను లాక్కెళ్ళే ప్రయత్నం చేయటం మాత్రం అందరినీ అబ్బురపరిచింది. తమన్నా తో చేసిన వానా వానా వెల్లు వాయే పాటకు మెగా ఫ్యాన్స్ నుంచి వీరాభినందనలు అందుతున్నారు. అలాగే రచ్చ టైటిల్ సాంగ్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

సినిమా కథ ఎలా ఉన్నా పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా తీయటంతో బి,సి సెంటర్లలో సినిమా బాగా నడుస్తోంది. అక్కడ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని,చిరంజీవి తెరపై కనపడని లోటు ని రామ్ చరణ్ తీరుస్తున్నాడని మురిసిపోతున్నారు. దానికి తోడు చిరంజీవి కూడా దగ్గర ఉండి తన స్టైల్,తన లాగే నడవటం,డైలాగు డెలివరీ వంటివి చేయించి సినిమాకు మెగా ముద్ర తెచ్చారు. పరుచూరి బ్రదర్శ్ రాసిన మాటలు సైతం సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.