భానుకిరణ్ అరెస్ట్ వెనుక జెసి పాత్ర లేదు

భానుకిరణ్ అరెస్ట్ వెనుక జెసి పాత్ర లేదు

తన భర్త మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ అరెస్టు వెనుక మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి హస్తం లేదని గంగుల భానుమతి స్పష్టం చేశారు. జెసి కుటుంబంతో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె చెప్పారు. భానుకు, జెసికి సంబంధాలు ఉండే అవకాశమే లేదన్నారు.

కాగా భానుకిరణ్ అరెస్టు లేదా లొంగుబాటు వెనుక రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ నేత హస్తం ఉందనే వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. శనివారం భాను కిరణ్ అరెస్టు తర్వాత పలువురు విలేకరులు పోలీసులను కూడా ఇదే ప్రశ్న అడిగారు. అరెస్టు లేదా లొంగుబాటు వెనుక జెసి హస్తం ఉందనే ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రశ్నించగా పోలీసులు కొట్టి పారేశారు. భాను లొంగిపోలేదని, ఆయనను తామె అరెస్టు చేశామని, ఆయన వెనుక ఎవరున్నారో విచారణలో తేలుతుందని చెప్పారు.

భాను అరెస్టయ్యారనే విషయం తెలిసిన భానుమతి శనివారం స్పందించిన విషయం తెలిసిందే. తనను దూషించడం వల్లనే మద్దెలచెర్వు సూరిని హత్య చేశానని భాను కిరణ్ చెప్పిన దానిలో వాస్తవం లేదని భానుమతి అన్నారు. దశాబ్దాల ఫాక్షన్ కక్షల్లో భాగంగానే సూరి హత్య జరిగిందని ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. భాను కిరణ్ వెనక పెద్దలున్నారని ఆమె ఆరోపించారు. భాను కిరణ్ అరెస్టుపై ఆమె శనివారం ప్రతిస్పందించారు.

తన భర్త హత్య విషయంలో ప్రత్యర్థి వర్గంపై తనకు అనుమానాలున్నాయని ఆమె చెప్పారు. దీనిపై తాను ముఖ్యమంత్రిని, హోం మంత్రిని కలుస్తానని ఆమె చెప్పారు. మీడియా సమావేశంలో భాను కిరణ్ నవ్వుతూ కనిపించాడని, అతని మానసిక స్థితిపై సందేహం కలుగుతోందని ఆమె అన్నారు. కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా తాము భాను కిరణ్‌ను విశ్వసించామని, ఇంత మోసం చేస్తాడని అనుకోలేదని ఆమె అన్నారు. తమకు అనుమానం వచ్చే విధంగా ఏనాడు కూడా ప్రవర్తించలేదని ఆమె అన్నారు.

అతడికి డబ్బు పిచ్చి మాత్రం ఉందని ఆమె అన్నారు. భానును ఆలస్యంగానైనా పట్టుకున్నందుకు ఆమె సిఐడి అధికారులకు కృతజ్ఢతలు తెలిపారు. అతడిని జీవితాంతం జైలులో ఉంచాలని ఆమె అన్నారు. భాను అరెస్టు విషయంలో తమకెలాంటి అనుమానాలు లేవని భానుమతి అన్నారు. భాను లొంగిపోయే పరిస్థితి లేదని, పోలీసులే అరెస్టు చేశారని తాము భావిస్తున్నామన్నారు. తాను మొదటి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చానని, ఈ నేపథ్యంలోనే అరెస్టు చేశారన్నారు.