సోనియాకు కెసిఆర్ బంపర్ ఆఫర్

 సోనియాకు కెసిఆర్ బంపర్ ఆఫర్

తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత 11 రోజుల పాటు ఢిల్లీలో ఉన్న ఆయన ఆ మేరకు కాంగ్రెసు అధిష్టానానికి ఫీలర్లు పంపినట్లు చెబుతున్నారు. 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో కాంగ్రెసు అధిష్టానంతో చర్చలు ప్రారంభించిన తర్వాత ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాదు బయలుదేరి వచ్చారు. సిపిఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తెలంగాణకు చెందిన సురవరం సుధాకర రెడ్డిని కెసిఆర్ కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని 18 స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు ముందే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కాంగ్రెసు అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో ఓడిపోతామనే ఆందోళన కాంగ్రెసు నాయకులకు అనవసరమని, తెలంగాణ ఇవ్వకపోయినా ఓడిపోవడం ఖాయమని కెసిఆర్ వాదిస్తున్నారు. వచ్చే 18 స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోతే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మనుగడ సాగించడం ఖాయమని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో తాము అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకైనా తమ మద్దతు అవసరం పడుతుందని, అప్పుడు తెలగాణ ఇవ్వకతప్పదని ఆయన అంటున్నట్లు చెబుతున్నారు. 

సీమాంధ్రకు వేరే రాజధానిని నిర్ణయించి హైదరాబాదును తాత్కాలికంగా ఉమ్మడి రాజధానిగా చేస్తే తనకు అభ్యంతరం లేదని కెసిఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. కెసిఆర్ ప్రతిపాదనలపై కాంగ్రెసు అధిష్టానం చర్చలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ముందు కాంగ్రెసు పార్టీ తేల్చుకుంటే తాను మళ్లీ వారంలో ఢిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కెసిఆర్ చెప్పారని అంటున్నారు.