ఉపఎన్నికల్లో చంద్రబాబుకు ఇంటి పోరు

ఉపఎన్నికల్లో చంద్రబాబుకు ఇంటి పోరు

ఉప ఎన్నికల టిక్కెట్ల వ్యవహారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పిగా తయారయినట్లుగానే కనిపిస్తోంది. త్వరలో సీమాంధ్రలో జరగనున్న ఉప ఎన్నికలలో ఆయా నియోజకవర్గాల టిక్కెట్ల కోసం అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మూడు నాలుగు స్థానాలలో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఆ పార్టీలో విభేదాలకు తెర లేపినట్లుగా కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో అసమ్మతి చిచ్చు రేగింది. పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడంలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే సింగన్నదొర పార్టీ పదవికి మంగళవారం రాజీనామా చేశారు. 

తన కుమారుడు రామ్మోహన్‌కు కాకుండా పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్‌ను ప్రకటించడం పట్ల సింగన్నదొర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పలువురు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం టిడిపిఅధినేత చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలు రాజీనామాలు చేయడం గమనార్హం. కడప జిల్లా రాజంపేటలో కూడా అభ్యర్థి ఎంపిక టిడిపికి సమస్యాత్మకంగా పరిణమించింది. 

గతంలో పోటీ చేసిన మదన్ మోహన్ రెడ్డిని పక్కనబెట్టి ఈసారి మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్యకు టిక్కెట్టు ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. దాంతో మదన్ మోహన్‌ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కబురు చేసినా రాకుండా దూరంగా ఉండిపోయారట. గత ఎన్నికల్లో మదన్ మోహన్‌ రెడ్డికి టిక్కెట్టు ఇవ్వడంపై బ్రహ్మయ్య పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. ఈసారి మదన్ మోహన్‌ రెడ్డి నుంచి సహాయ నిరాకరణ ఎదురు కావడం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. 

కాగా అనంతపురంలో అభ్యర్ధి ఎంపిక కూడా పార్టీకి కొరుకుడు పడటం లేదు. మాజీ మునిసిపల్ చైర్మన్ ప్రభాకర్ చౌదరికి ఇవ్వాలని ఒక దశలో పార్టీ నాయకత్వం భావించింది. కాని ఆ జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు విభేదించారు. పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన మహాలక్ష్మి శ్రీనివాస్‌కే ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. ఈ నేతల వైఖరితో ప్రభాకర్ మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం ఇక్కడ చంద్రబాబు సమక్షంలో జరిగిన సమావేశంలో ఆయన తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పారు.

ఈ సీటుపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లా మాచర్లలో అభ్యర్థి ఎంపికపై కూడా పార్టీ తేల్చుకోలేకపోతోంది. రెండు సామాజిక వర్గాల నుంచి ఏడుగురు అభ్యర్థులు అక్కడ పార్టీ పరిశీలనలో ఉన్నారు. సామాజిక సమీకరణాలు కీలకంగా మారడంతో ఇతర పా ర్టీల అభ్యర్థులు ఖరారైన తర్వాత తాము నిర్ణయానికి రావాలని ఆ పార్టీ భావిస్తోంది.