పంతం నెగ్గించుకున్న బాబు

పంతం నెగ్గించుకున్న బాబు

 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. పోలీసులు వద్దని అడ్డుకున్నా వినకుండా ఆయన సోమవారం విజయనగరం జిల్లా కార్యాలయం జంక్షన్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసు బారికేడ్లను ఛేదించారు. దాంతో చంద్రబాబు విగ్రహం వైపు కదిలారు.

ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్న చంద్రబాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా ధర్నా చేపడితే పోలీసులు అడ్డుకున్నారని ఆయన అన్నారు. అనేక ఇబ్బందులు కలిగించారని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకుడు అశోక్ గజపతి రాజుకు కూడా ఆగ్రహం వచ్చిందని, అశోక్ గజపతి రాజు తలుచుకుంటే బొత్స సత్యనారాయణ విజయనగరంలో ఉంటారా అని ఆయన అన్నారు. 

మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగా తాము తలపెట్టిన ధర్నాకు అనుమతి ఇచ్చే వరకు  జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కదిలేది లేదని నారా చంద్రబాబు నాయుడు అంతకు ముందు పట్టబట్టారు. నాలుగు రోజులైనా ఇక్కడే ఉంటానని ఆయన చెప్పారు. రాత్రి కూడా ఇక్కడే ఉంటానని ఆయన చెప్పారు. రోడ్డుపైన బైఠాయించారు. 

ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నా చేస్తే మీకున్న అభ్యంతరమేమిటని ఆయన పోలీసు అధికారులను ప్రశ్నించారు. ధర్నాకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఎస్పీ కార్తికేయపై మండిపడ్డారు. తాను కదిలేది లేదంటూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ కార్యాలయం జంక్షన్‌లో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి కూడా చంద్రబాబుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు మరింతగా ఆగ్రహించారు.