షీలా దీక్షిత్ ఎత్తులు చిత్తు

షీలా దీక్షిత్ ఎత్తులు చిత్తు

దేశ రాజధాని న్యూఢిల్లీ మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గాలి మళ్లీ వీచింది. ఢిల్లీ ప్రజలు ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఎత్తులను చిత్తు చేస్తూ అక్కడ కాషాయ జెండా ఎగుర వేయించారు. 2007 సంవత్సరంలో ఢిల్లీ మున్సిపాలిటీని బిజెపి గెలుపొందింది. దాంతో ఈసారి ఎలాగైనా అక్కడ తమ పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశ్యంతో షీలా దీక్షిత్ పట్టు బట్టి ఢిల్లీని మూడు మున్సిపాలిటీలుగా విభజించింది. మూడుగా విభజిస్తే కనీసం ఒక్క స్థానమైనా గెలుపొందవచ్చునని భావించింది.

అయితే ఆమె ఎత్తులు పారలేదు. షీలా విభజన తంత్రం బెడిసి కొట్టింది. మూడు స్థానాలలోనూ బిజెపి కాషాయ జెండా ఎగుర వేసింది. రెండు స్థానాలలో స్పష్టమైన మెజార్టీ దక్కించుకోగా మరో స్థానంలో ముందంజలో ఉంది. స్వతంత్ర అభ్యర్థులు కలుపుకొని అక్కడ బిజెపియే మేయర్ స్థానాన్ని చేజిక్కించుకోనుంది.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో బిజెపి ఘన విజయం ఆ పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. వాస్తవానికి, ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో, ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా అభివర్ణించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టిన షీలా 14 ఏళ్లుగా ఢిల్లీని ఏలుతున్నారు. అయితే, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం బిజెపి పట్టు కొనసాగుతోంది.

అయితే బిజెపికి గతంతో పోలిస్తే కొన్ని సీట్లు తగ్గినా మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లోనూ బిజెపియే తన హవా కొనసాగించింది. ఢిల్లీ ఉత్తరం, ఢిల్లీ తూర్పు కార్పొరేషన్లలో పూర్తి మెజారిటీ సాధించగా ఢిల్లీ దక్షిణం కార్పొరేషన్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మూడు కార్పొరేషన్లలోనూ మొత్తం 272 వార్డులు ఉన్నాయి. వీటిలో బిజెపి 138 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్ 78 స్థానాలను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి జగ్ రోషిణి బేగంపూర్ వార్డు నుంచి అత్యధికంగా 17,284 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

ఇక, సత్వీందర్ కౌర్ సిర్సా కూడా 11,584 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమె కోటీశ్వరురాలు. ఎన్నికల అఫిడవిట్‌లోనే తన ఆస్తి రూ.112 కోట్లు అని ఆమె ప్రకటించారు. అవినీతి కాంగ్రెస్‌కు తామే అసలైన ప్రత్యామ్నాయమని ప్రజలు భావించారని, ఈ ఎన్నికలు దేశ రాజధానిలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలకు నిదర్శనమని బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ చెప్పారు. అవినీతి, అధిక ధరలు, కాంగ్రెస్ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వెలువడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిని కాంగ్రెస్ తేలిగ్గా తీసిపారేసింది. ఇవి స్థానిక సంస్థల ఎన్నికలేనని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటూ బిజెపి జబ్బలు చరచుకుంటోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ విమర్శించారు. ఎంసిడి ఎన్నికల్లో గతంలోనూ బిజెపియే విజయం సాధించిందని, ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు.