ఢిల్లీలో చక్రం తిప్పుతున్న జయలలిత

ఢిల్లీలో చక్రం తిప్పుతున్న జయలలిత

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత న్యూఢిల్లీలో సోమవారం చక్రం తిప్పుతున్నట్లుగా కనిపిస్తోంది. యుపిఏ ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఆమె కేంద్రంలో కాంగ్రెసుకు వ్యతిరేక పక్షాన్ని తయారు చేసే పనిలో పడ్డట్లుగా కనిపిస్తోంది. సోమవారం అంతర్గత భద్రతా సమావేశంలో పాల్గొన్న జయలలిత కేంద్రం తీరుపై విరుచుకు పడ్డారు. ఎన్‌సిటిసి విషయంలో రాష్ట్రాల అధికారాలను చేజిక్కించుకునేలా కేంద్రం తీరు ఉందని ఆమె మండిపడింది.

ఎన్‌సిటిసి విషయంలో కేంద్రంతో విభేదించిన ఆమె కాంగ్రెసుకు వ్యతిరేక పక్షాన్ని తయారు చేసే పనిలో పడ్డారు. సాయంత్రం కాంగ్రెసేతర ముఖ్యమంత్రులతో ఆమె భేటీ అయ్యారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెతో భేటీ అయ్యారు. ఆమెకు వారు మద్దతిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

వారి మధ్య ఎన్‌సిటిసిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అంతకుముందు కాంగ్రెసేతర సిఎంలు అంతర్గత భద్రతా సమావేశంలో కేంద్రంపై ధ్వజమెత్తారు. కేంద్రం పని తీరును జయలలిత నిలదీశారు. యుపిఏ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని బలహీనపరుస్తోందని ఆమె మండిపడ్డారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం చేజిక్కుంచుకునే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం మున్సిపల్ వ్యవస్థలుగా మార్చిందని మండిపడ్డారు. ఆర్పీఎఫ్ చట్టం జాతీయ ఉగ్రవాద నిర్మూలన యుపిఏ వ్యూహంలో భాగమేనని ఆరోపించారు.

కేంద్రం తీరు వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగాథం పెరుగుతోందని గుజరాత్ సిఎం నరేంద్ర మోడి విమర్శించారు. అలాగే మిలిటరీ, సివిల్ సర్వీసుల మధ్య కూడా అగాథం పెరుగుతోందన్నారు. దేశ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. కాగా అంతకుముందు ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం దేశానికి సవాళ్లు విసురుతోందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. సోమవారం జాతీయ అంతర్గత భద్రతా సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ఈ సదస్సు వల్ల అందరి అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. వామపక్ష తీవ్రవాదం దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. దేశ భద్రత విషయంలో సమైక్య సహకారం ఉంటేనే ఉగ్రవాదాన్ని నిర్మూలించగలమని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతర్గత భద్రత సదస్సు ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పారు. ఎన్‌సిటి‌సిపై మే 5న ముఖ్యమంత్రులతో మరోసారి సమావేశమవుతామని మన్మోహన్ చెప్పారు. కేంద్రం, రాష్ట్రాలు చేయి చేయి కలిపితే అంతర్గత భద్రత సాధ్యమని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉందన్నారు. జమ్ముకాశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడిందన్నారు. తీర ప్రాంత భద్రతకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.