'టైమ్‌'కెక్కిన మమతా బెనర్జీ

'టైమ్‌'కెక్కిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన వంద మందిలో ఒకరని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. 2012కుగాను ప్రభావశీలుర జాబితాను టైమ్ మ్యాగజైన్ బుధవారం విడుదల చేసింది. భారత్ నుంచి ఇద్దరు మహిళలకు చోటు లభించింది.

మమతా బెనర్జీతో పాటు ఇండియాలో స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడుతున్న లాయర్ అంజలీ గోపాలన్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. అంజలీ స్వలింగ సంపర్కుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మమతను ఓ పాదరస గుళికలా.. వీధి పోరాటాలకు సైతం వెరవని వ్యక్తిగా టైమ్ కితాబిచ్చింది.

ముఖ్యమంత్రిగా ఆమె కార్యశీలిగా, ప్రజల మనిషిగా నిలిచారని పేర్కొంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత రాజకీయాల్లో ఆమె తనదైన ముద్ర వేశారని తెలిపింది. టైమ్ జాబితాలో.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, అపర కుబేరుడు వారెన్ బఫెట్ తదితరులు ఉన్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఆస్కార్ విజేత షర్మీన్ ఒబెయిన్, పాక్ చీఫ్ జస్టిస్ ఇఫ్తికర్ చౌధరి కూడా ఈ జాబితాలో ఉన్నారు.

కాగా మమతా బెనర్జీ మరింత పరిణతితో వ్యవహరించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ సూచించారు. ప్రజాస్వామ్య విధానంలో ఎలా పనిచేయాలో మమత నేర్చుకోవాలని చెప్పారు. కార్టూన్ వివాద నేపథ్యంలో జస్టిస్ కట్జూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అరెస్టు చేసిన సైంటిస్ట్ పార్థసారధిరే బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం వల్లే తనను బెయిల్‌పై విడుదల చేశారని అన్నారు.