సిబిఐవి కట్టు కథలన్న సాయి లాయర్

 సిబిఐవి కట్టు కథలన్న సాయి లాయర్

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అరెస్టై బెయిల్ పొందిన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పైన గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో సిబిఐ సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు విచారణ జరిగింది.

ఈ సందర్భంగా విజయ సాయి తరఫు న్యాయవాది సుషీల్ కుమార్.. ఛార్జీషీటులో సిబిఐ చెప్పినవి అన్నీ కట్టుకథలేనని కోర్టుకు తెలిపారు. విజయ సాయి ఎక్కడకు వెళ్లినా ఇంటెలిజన్స్ వర్గాలు వెంబడిస్తున్నాయని అన్నారు. ఎఫ్ఐఆర్‌లో డెబ్బై రెండు మందిని నిందితులుగా పేర్కొన్న సిబిఐ కేవలం విజయ సాయిని మాత్రమే ఆరెస్టు చేసిందని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఛార్జీషీటులో కూడా పదమూడు మందినే పేర్కొందన్నారు.

ఇదే కేసులో సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రులు, పద్నాలుగు మంది ఐఏఎస్ అధికారులను సిబిఐ అధికారులు ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. దర్యాఫ్తు పూర్తయ్యాకే ఛార్జీషీట్ దాఖలు చేయాలనే విషయం సిబిఐకి తెలియదా అన్నారు. 26 జివోలు జారీ చేసిన వారిని పక్కకు పెట్టడమేమిటన్నారు.

అందుకు సిబిఐ తరఫు న్యాయవాది.. జగన్ ఆస్తుల కేసులో విజయ సాయి రెడ్డి పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పారు. వివిధ కంపెనీల నుండి విజయ సాయి రెడ్డి భారీగా నిధులను మళ్లించారని చెప్పారు. ప్రతిఫలంగా ఆయా కంపెనీల నుండి లబ్ధి పొందారని చెప్పారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని సూచించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు ఈ కేసులో కోర్టులో దాఖలు చేసిన పత్రాలను విజయ సాయి తరఫు న్యాయవాదికి ఇవ్వాలని సిబిఐకి కోర్టు సూచించింది. అయితే అలా ఇస్తే ఇబ్బందులు తలెత్తుతాయని సిబిఐ కోర్టుకు తెలిపింది.

ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి పిఏ అలీ ఖాన్ కస్టడీ పిటిషన్ పైన విచారణను నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు 24కు వాయిదా వేసింది. ఇదే కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్ పైన విచారణను 25కు వాయిదా వేసింది. బిపి ఆచార్య బెయిల్ పిటిషన్ విచారణను 23కు వాయిదా వేసింది. ఎమ్మార్ కేసులో నిందితుడు విజయ రాఘవ రిమాండ్ చెల్లదంటూ దాఖలైన పిటిషన్ పైన వాదనలు పూర్తయ్యాయి. తీర్పును కోర్టు 23కు వాయిదా వేసింది.