న్యూస్ చానెళ్లు చూడకండి: మమతా బెనర్జీ

న్యూస్ చానెళ్లు చూడకండి: మమతా బెనర్జీ

 పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో సంచలన వ్యాఖ్య చేశారు. సామాన్యులకు సంబంధించిన పలు అంశాల విషయంలో ఉక్కు పాదం మోపుతున్న ఆమె తాజాగా న్యూస్ చానెళ్లు చూడవద్దని పశ్చిమ బెంగాల్ ప్రజలకు సూచించారు. నార్త్ 24 పరగణలోని ఓ బహిరంగ సంభలో మాట్లాడుతూ ఆమె ఆ సూచన చేశారు. న్యూస్ చానెళ్లకు బదులు ఎంటర్‌టైన్‌మెంట్ చానెళ్లు చూడాలని ఆమె సూచించారు. 

న్యూస్ చానెళ్ల తన ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని, తమ ప్రభుత్వ తీరును తప్పుపట్టడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. న్యూస్ చానెళ్లు చూడడానికి బదులు సంగీతాన్ని ఆనందించాలని ఆమె తన పార్టీ శ్రేణులకు సూచించారు. రెండు మూడు సిపిఎం న్యూస్ చానెళ్లున్నాయని, వాటిని అసలు చూడవద్దని ఆమె అన్నారు. దానికి బదులు ఇతర చానెళ్లల్లో సంగీత కార్యక్రమాలను చూడాలని ఆమె అన్నారు.

 
ప్రజలకు సేవ చేయడం నుంచి తనను ఎవరూ అడ్డుకోలేరని ఆమె అన్నారు. అబద్దాలతో, తప్పుడు సమాచారంతో తన ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రయత్నించేవారు ఓడిపోతారని ఆమె అన్నారు. ప్రచారం ఏ మాత్రం ఉపయోగపడదని ఆమె అన్నారు. వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నప్పటికీ ప్రజలను అభివృద్ధి పథంలోకి నడిపించే తన ప్రయత్నం ఆగదని ఆమె అన్నారు. 

ప్రభుత్వం బలవంతంగా రైతుల భూములు లాక్కుని సెజ్‌లకు కేటాయించాలని, భూపరిమితి నిబంధనలను సడలించాలని చాలా మంది కోరుకుంటున్నారని, తాను ఏ రోజు కూడా అలా చేయబోనని, పశ్చిమ బెంగాల్ ప్రజలు ల్యాండ్ మాఫియాలను, లూటర్లను అనుమతించరని ఆమె అన్నారు