వెంకటేష్, మహేష్ బాబు....పైచేయి ఎవరిది?

వెంకటేష్, మహేష్ బాబు....పైచేయి ఎవరిది?

విక్టరీ వెంకటేష్, సూర్ స్టార్ మహేష్ బాబు మల్టీ స్టారర్‌గా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

వెంకటేశ్, మహేశ్ ఇద్దరూ స్టార్ యాక్టర్లే. అందుకే ఎన్నో సంవత్సరాల తర్వాత అసలు సిసలు మల్టీస్టారర్‌గా ఈ సినిమా పేరు తెచ్చుకుంది. ఇందులో వెంకటేశ్, మహేశ్ నటనని విమర్శకులే గాక, వారి అభిమానులు, సాధారణ ప్రేక్షకులు సైతం బేరీజు వేస్తారు. 

అంటే ఇటు వెంకటేశ్, అటు మహేశ్ ఈ ఒత్తిడిని అధిగమిస్తూ నటించాల్సి ఉంది. ఇద్దరూ ఉత్తమ నటులుగా నంది అవార్డులు తీసుకున్నవాళ్లే. సీనియర్‌గా వెంకటేశ్‌పై, సూపర్‌స్టార్ ఇమేజ్ ఉన్నందువల్ల మహేశ్‌పై ఒత్తిడి ఉండటం సహజం. ఈ నేపథ్యంలో ఎవరిది పైచేయి అవుతుందనే విషయం చర్చనీయాంశం అయింది.

ఈ చిత్రం గురించి దిల్‌ రాజు కొన్ని రోజుల క్రితం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ...25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్‌ ఇది. వెంకీ, మహేష్‌ అన్నదమ్ము లుగా నటిస్తున్నారు. సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు..అంటే కుటుంబం. టైటిల్‌ మంచి ఫీల్‌నిచ్చింది. మే నెలాఖరుకి సినిమా పూర్తిచేసి..అదే నెలలో విడుదల చేస్తాం అన్నారు. అయితే దిల్ రాజు చెప్పిన దానికంటే సినిమా మరింత ఆలస్యంగా ప్రేక్షకుల మందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహనిర్మాతలు: శిరీష్‌- లక్ష్మణ్‌, కథ- కథనం-మాటలు-దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.